Virat Kohli : డబ్ల్యూపీఎల్ విజేతగా ఆర్సీబీ.. విరాట్ కోహ్లీ ఏ సందేశం పంపాడో తెలుసా?
డబ్ల్యూపీఎల్ 2026 విజేతగా రెండోసారి ఆర్సీబీ నిలవడంపై విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Virat Kohli congratulated the RCB team for their second Womens Premier League title
Virat Kohli : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. గురువారం వడోదర వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి కప్పును ముద్దాడింది. కాగా.. డబ్ల్యూపీఎల్ విజేతగా నిలవడం ఆర్సీబీకి ఇది రెండో సారి. గతంలో 2024 డబ్ల్యూపీఎల్ విజేతగా నిలిచింది. ప్రస్తుతం ఆర్సీబీ జట్టుపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమ్ఇండియా స్టార్ ప్లేయర్, ఆర్సీబీ కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ సైతం స్మృతి మంధాన సేన పై ప్రశంసలు కురిపించాడు.
మళ్ళీ ఛాంపియన్లుగా నిలిచారు. ఆర్సీబీ జెండాను అత్యున్నత స్థానంలో ఎగురవేశారు. స్మృతి మంధాన, జట్టును చూసి ప్రతి ఒక్కరు గర్వపడాలి. జట్టుతో పాటు టీమ్‌మేనేజ్‌మెంట్ మొత్తానికి అభినందనలు. ఈ విజయానికి మీరు నిజంగా అర్హులు. ఈ క్షణాన్ని బాగా అస్వాదించండి. అదే సమయంలో అభిమానుల యొక్క అనిర్వచనీయ ప్రేమను స్వీకరించండి అంటూ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 57 పరుగులు), లారా వోల్వార్డ్ట్ (25 బంతుల్లో 44 పరుగులు), లిజెల్ లీ (30 బంతుల్లో 37 పరుగులు), చినెల్లే హెన్రీ (15 బంతుల్లో 35 నాటౌట్) వేగంగా ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో సయాలి సత్ఘారే, నాడిన్ డి క్లెర్క్, అరుంధతి రెడ్డిలు తలా ఓ వికెట్ సాధించారు.
View this post on Instagram
అనంతరం 204 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ జట్టు 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ స్మృతి మంధాన (41 బంతుల్లో 87 పరుగులు), జార్జియా వాల్ (54 బంతుల్లో 79 పరుగులు) మెరుపులు మెరిపించారు. ఢిల్లీ బౌలర్లలో చినెల్లే హెన్రీ రెండు, నందిని శర్మ, మిన్నుమణి లు చెరో వికెట్ సాధించారు.
