Rajasthan : భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లి ప్రియుడితో హత్యచేయించిన భార్య.. రోడ్డు ప్రమాదం అంటూ డ్రామా.. పోలీసుల ఎంట్రీతో..
Rajasthan : మేఘాలయ ‘హనీమూన్ హత్య’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరుహా ఘటనను గుర్తుకుతెస్తూ రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
Rajasthan
Rajasthan : మేఘాలయ ‘హనీమూన్ హత్య’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరుహా ఘటనను గుర్తుకుతెస్తూ రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన మూన్నెళ్లకే భర్తను భార్య హత్య చేయించింది. వాకింగ్ కు తీసుకెళ్లి ప్రియుడు, అతని స్నేహితుడు సహాయంతో భర్తపై దాడిచేయించింది. ఆ తరువాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పెద్ద డ్రామానే ఆడింది. అయితే, పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన ఆశిష్‌కు అంజూ అనే యువతితో వివాహం జరిగింది. అంజూకు వివాహంకు ముందే తన ఇంటి సమీపంలో ఉండే సంజూ అనే వ్యక్తితో ప్రేమవ్యవహారం నడిచింది. పెండ్లి తరువాత కూడా ప్రియుడితో తరచూ అంజూ మాట్లాడుతూ ఉండేది. అయితే, పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రియుడు సంజూను కలిసింది. ఆ సమయంలో ఆశిష్ అడ్డు తొలగించుకొని ఇద్దరం పెండ్లి చేసుకుందామని వారు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఓ ప్రణాళికను సిద్ధం చేశారు. తన భర్త (ఆశిష్)ను వాకింగ్ కోసం బయటకు తీసుకొస్తానని.. ఆ సమయంలో తనపై దాడిచేసి హత్య చేసి.. ఆ తరువాత యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని భావించారు.

ముందస్తు ప్రణాళికలో భాగంగా భర్తను అంజూ వాకింగ్ కు తీసుకెళ్లింది. జనవరి 30వ తేదీ రాత్రి 9గంటల సమయంలో వారిద్దరూ వాకింగ్ కు వెళ్లారు. కొద్దిసేపటికే ఆశిష్, అంజూ రోడ్డుపై అపస్మారక స్థితిలో పడిఉండటంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆశిష్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకిదిగి కేసు నమోదు చేశారు. ఆశిష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి.. అంజూను ఘటనకు సంబంధించి విచారణ చేశారు.

అంజూ పోలీసులకు తెలిపిన ప్రకారం.. తాము రాత్రివేళ వాకింగ్‌కు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వాహనం తమను ఢీకొట్టిందని, ఆ తరువాత అందులోని వ్యక్తులు తన నగలు లాక్కెళ్లినట్లు తెలిపింది. అయితే, అంజూ ప్రవర్తనపై పోలీసులకు అనుమానం రావడంతో పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆశిష్ శరీరంపై ఎవరో కొట్టినట్లుగా బలమైన గాయాలు ఉండడం.. కారుతో ఢీకొట్టినా అంజూకు ఎలాంటి గాయాలు కాకపోవటంపై పోలీసులకు అనుమానం వచ్చి ఆమెను గట్టిగా నిలదీశారు. దీంతో అసలు విషయం చెప్పేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆశిష్‌తో పెండ్లికంటే ముందే అంజూ తన ప్రియుడు సంజూతో ప్రేమలో ఉంది. పెండ్లి తరువాత ఆశిష్ అడ్డు తొలగించుకొని సంజూతో కలిసి జీవించాలని అనుకుంది. ఈ క్రమంలో సంజూ, అంజూలు అందుకోసం ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా వాకింగ్‌కు వెళ్లిన సమయంలో సంజూ, అతని ఇద్దరు స్నేహితులు ఆశిష్ పై దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటనను నగలకోసం దాడి జరిగినట్లు నమ్మించడానికి అంజూ తన చెవి కమ్ములు, ఫోన్ సంజూకు ఇచ్చి పంపింది. ఆ తరువాత స్పృహ తప్పి రోడ్డుపై పడిపోయినట్లు నటించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
