భారత మహిళా జట్టుకు ఎంపికైన తెలుగమ్మాయి

భారత మహిళా జట్టుకు ఎంపికైన తెలుగమ్మాయి

దేశీయ క్రీడారంగంలో తెలుగు తేజాలు సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే.. తెలుగు గిరిజన అమ్మాయి గుగులోత్ సౌమ్య భారత ఫుడ్‌బాల్ జట్టు తరుపున 19ఏళ్లకే అడుగుపెట్టబోతున్నారు. కృషి, పట్టుదలతో ఫుట్‌బాల్‌ క్రీడలో రాణిస్తోన్న గుగులోత్‌ సౌమ్య.. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కిసాన్ నగర్ తండాకు చెందిన అమ్మాయి.. భారత అండర్-17 మహిళా ఫుట్‌బాల్ జట్టుకు సౌమ్య సారధ్యం వహించింది.

నిరుపేద కుటుంబంలో పుట్టిన సౌమ్య.. తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి కాగా.. ఆడపిల్లల్లో అందరి కంటే చిన్నమ్మాయి సౌమ్య. పాఠశాల దశలో జరిగిన పోటీల్లో పరుగుపందెంలో అద్భుత ప్రతిభ కనబరిచిన సౌమ్య ఏడో తరగతిలో ఉండగానే జిల్లా అధికారుల దృష్టిని ఆకర్షించి, 400 మీ., 800 మీ. పరుగులో అద్భుతంగా రాణించగా.. సౌమ్య ప్రతిభను గుర్తించిన కోచ్ నాగరాజు.. ప్రత్యేకంగా అకాడమీ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తూ వచ్చారు.

ఆడపిల్ల కావడంతో మొదట సౌమ్య తల్లిదండ్రులు ఫుట్‌బాల్ కోచింగ్‌కు ఒప్పుకోలేదు. కానీ, నాగరాజు నచ్చజెప్పడంతో అంగీకరించగా.. 2013 నుంచి ఆమె ఫుట్‌బాల్ సాధన చేస్తోంది. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు జాతీయ జట్టులో స్థానం సంపాదించుకుంది. తెలంగాణ రాష్ట్ర అండర్ 14, 15, 16 జట్లకు కూడా సౌమ్య ప్రాతినిధ్యం వహించింది.

పందొమ్మిదేళ్లకే భారత సీనియర్‌ మహిళల జట్టులో చోటు దక్కించుకున్న సౌమ్య.. 2020 ఫిబ్రవరి 14వ తేదీ నుంచి టర్కీలో జరిగే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ పోటీల్లో భారత జట్టు తరఫున ఆడబోతుంది. గోవాలో 20 మందితో కూడిన తుది జట్టును ప్రకటించగా, అందులో సౌమ్యకు చోటు దక్కింది. 30 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి భారత సీనియర్‌ మహిళల జట్టుకు ఎంపికైన క్రీడాకారిణిగా సౌమ్య రికార్డు క్రియేట్ చేసింది.

ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో సౌమ్య కదలికలు చాలా వేగంగా ఉండడేవని, సీనియర్‌ జట్టులో చోటు కోసం సౌమ్య కఠోరంగా శ్రమించినట్లు, రోజూ ఆరు గంటల పాటు ప్రాక్టీస్‌ చేసినట్లుగా కోచ్ గొట్టిపాటి నాగరాజు వెల్లడించారు.