Site icon 10TV Telugu

Foxtail Millet Cultivation : అధిక దిగుబడినిచ్చే కొర్ర రకాలు- సాగు యాజమాన్యం

Foxtail Millet Cultivation

Foxtail Millet Cultivation

Foxtail Millet Cultivation : తక్కువ నీరు, అతి తక్కువ పెట్టుబడితో సాగయ్యే పంటలు చిరుధాన్యాలు. రాగి తర్వాత ఇటీవలి కాలంలో కొర్రలకు మంచి మార్కెట్ డిమాండ్ ఏర్పడటంతో  రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతికూల వాతావరణంలో  సైతం, రైతుకు భరోసానిస్తూ  స్వల్పకాలంలో  చేతికొచ్చే పంటగా కొర్ర పేరుగాంచింది .కొర్రల్లో వున్న పోషక విలువల పట్ల ప్రజల్లో అవగాహన  పెరగటంతో , వినియోగం ఊపందుకుంది. ఖరీఫ్ లో సాగుచేయాలనుకే రైతులు.. ఎలాంటి రకాలను ఎన్నుకోవాలి..? సాగు యాజమాన్యం ఏవిధంగా చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : Sorghum Cultivation Process : కంది పంట సాగులో పాటించాల్సిన మెళకువలు.. అధిక దిగుబడులకు శాస్త్రవేత్తల సూచనలు 

చిరుధాన్యాల్లో కొర్రలది  విశిష్ఠ స్థానం. అన్ని చిరుధాన్యాల  కంటే  కొర్రయొక్క పంట కాలపరిమితి చాలా తక్కువ. కేవలం మూడు నాలుగు వర్షాలతో పంట పూర్తవుతుంది.. బియ్యం, గోధుమల్లో కంటే దీనిలో పోషక పధార్ధాలు అధికం. 100 గ్రాముల కొర్రల్లో 12.3 గ్రాముల మాంసకృతులు, 8 గ్రాముల పీచుపదార్థం , 3.3 గ్రాముల ఖనిజ లవణాలు, 31 శాతం కాల్షియం, 2.8 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. పీచు పదార్ధం అధికంగా వుండటం వల్ల చెడు కొలస్ట్రాల్ ను తొలిగించి స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. బీపీ, షుగర్, గుండె జబ్బులను  నిరోధించటంతో పాటు, అనేక ఆరోగ్య సమస్యలను  అధిగమించేందుకు  దివ్యమైన ఆహారం కొర్ర. ఈ పంటలో అధిక దిగుబడినిచ్చే పలు రకాలను తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ పరిశోధనా స్థానాలు రూపొందించాయి. అయితే వాటి గుణగణాలు.. సాగుకు యోగ్యమయ్యే భూములు… సమగ్ర సాగు వివరాలను ఇప్పుడు చూద్దాం…

అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో కొర్ర పంటను సాగు చేసుకొని అధిక దిగుబడులు సాధించవచ్చు. తేలికపాటి ఎర్ర చల్మానేలలు, నల్లరేగడి నేలలు, మురుగు నీటి పారుదల సౌకర్యం గల నేలలు అనుకూలమైనవి. ఖరీఫ్‌లో జూన్‌ రెండవ వారం నుండి జూలై చివరి వారం వరకు విత్తుకోవచ్చు. వేసవిలో జనవరి చివరి వరకు విత్తుకోవాలి. అధిక దిగుబడినిచ్చే పలు రకాలను వ్యవసాయ పరిశోధనా స్థానాలు రూపొందించాయి. అందులో ముఖ్యమైనవి సూర్య నంది, ఎస్‌.ఐ.ఏ-3156 (ముప్పైఒకటి యాబైఆరు), ఎస్‌.ఐ.ఏ-3085 (ముప్పై ఎనబై ఐదు). సూర్య నంది రకం. ఇది ఖరీఫ్, వేసవికి అనువైన రకం. పంట కాలం  75 నుండి 80 రోజులు. అగ్గితెగులు, వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది. వివిధ పంటలలో అంతర పంటగా పండించుటకు అనుకూలం. ఎకరాకు దిగుబడి 10 నుండి 12 క్వింటాళ్లు వస్తుంది. ఎస్‌.ఐ.ఏ-3156 రకం . ఖరీఫ్ కు అనువైన రకం.

పంటకాలం 85 నుండి 90 రోజులు. అధిక దిగుబడినిచ్చే రకం. వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది. ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. ఎస్‌.ఐ.ఏ-3085 రకం . ఖరీఫ్, వేసవికి అనువైన రకం . పంట కాలం  75 నుండి 80 రోజులు. నీటి ఎద్దడిని, అగ్గితెగులును తట్టుకుంటుంది. ఎకరాకు దిగుబడి 8 నుండి 10 క్వింటాళ్లు వస్తుంది. ఎకరాకు 2 కిలోల విత్తన సరిపోతుంది. విత్తే ముందు 1 శాతం విత్తనం, 8 శాతం సన్నని ఇసుక కలుపుకొని వరుసల మధ్య 30 సెం.మీ., మొక్కల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేలా గొర్రుతో విత్తుకోవాలి.

ఎకరాకు 3 నుండి 4 టన్నుల పశువుల ఎరువు వేసి అఖరు దుక్కిలో కలియదున్నాలి.  8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం నిచ్చే ఎరువులను విత్తేటప్పుడు వేయాలి. విత్తిన 30 నుండి 35 రోజుల దశలో మరో 8 కిలోల నత్రజనినిచ్చే ఎరువును పై పాటుగా వేసుకోవాలి. కొర్ర పంటను అంతర పంటలుగా కూడా సాగుచేసుకోవచ్చు. కొర్ర 5 వరుసలు కంది లేదా సోయాచిక్కుడు ఒక వరుస విత్తుకోవాలి విత్తిన 30 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా అంతర కృషి చేయాలి.

కొర్ర తక్కువకాలంలో  చేతికొచ్చే పంట కనుక  చీడపీడల బెడద తక్కువ వుంటుంది . అయినా ప్రధానంగా ఆశించే తెగుళ్ల నివారణ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గులాబి రంగు పురుగు ఆశిస్తుంది. లార్వాలు మొవ్వుని తొలచి తినడం వలన మొవ్వు చనిపోతుంది. దీని నివారణకు 2.5 మి.లీ. క్లోరిపైరిఫాస్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మరోతెగులు వెర్రి కంకి.

తేమతో కూడిన వాతావరణంలో అకుల అడుగున బూజు లాంటి శిలీంద్రం పెరుగుదల కనిపిస్తుంది. మొక్క నుండి బయటకు వచ్చిన కంకులు అకుపచ్చని అకుల మాదిరిగా మారతాయి. దీని నివారణకు 2 గ్రా. మెటలాక్సిల్‌ 35 డబ్యుఎస్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అగ్గి తెగులు ఆశించన మొక్కల అకులపై మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్‌ లేదా 1 గ్రా. కార్బండిజమ్‌ చొప్పున కలిపి పైరుపై పిచికారి చేయాలి.

Read Also : Basmati Rice : అధిక దిగుబడినిచ్చే ఖరీఫ్‌కు అనువైన బాస్మతి వరి రకాలు

Exit mobile version