Sugarcane Cultivation Methods : చెరకు కార్శీ తోటల యాజమాన్యం.. అధిక దిగుబడులకోసం శాస్త్రవేత్తల సూచనలు

Sugarcane Cultivation Methods : మొక్కతోటలతో పోలిస్తే.. కార్శీతోటల్లో రైతుకు పెట్టుబడి ఖర్చు చాలావరకు కలిసొస్తుంది. అయితే, కార్శీలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం వల్ల దిగుబడులు నాశిరకంగా వుంటున్నాయి.

Modern methods of sugarcane cultivation

Sugarcane Cultivation Methods : తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల హెక్టార్లలో సాగుచేయబడుతున్న వాణిజ్యపంట చెరకు. కొన్ని ప్రాంతాలలో క్రొత్తగా మొక్కతోటలు నాటేందుకు సిద్ధమవుతుండగా, మొక్కతోటలు నరికిన రైతాంగం తిరిగి కార్శీ చేయటం సర్వసాధారణం. మొక్కతోటలతో పోలిస్తే.. కార్శీతోటల్లో రైతుకు పెట్టుబడి ఖర్చు చాలావరకు కలిసొస్తుంది. అయితే, కార్శీలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం వల్ల దిగుబడులు నాశిరకంగా వుంటున్నాయి. మొక్కతోటలకు ధీటుగా రెండవ పంట నుంచి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే తప్పనిసరిగా సమయానుకూలంగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. టి . చిత్కాలదేవి.

చెరకు సాగులో నాటిన మొదటి సంవత్సరంలో కంటే, రెండో సంవత్సరంలో చేపట్టే కార్శితోటల సాగు రైతుకు లాభదాయకంగా వుంటుంది. కార్శిసాగులో విత్తనం ఖర్చు, భూమి తయారీ వంటి ఖర్చులు వుండవు కనుక ఎకరాకు 15వేల వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. గతంలో మొక్కతోటలు ఎక్కువ విస్తీర్ణంలోను కార్శీలు తక్కువగాను వుండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే చెరకుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు తక్కువగా వుండటం, పెరుగుతున్న చీడపీడలు వంటి పలు కారణాల వల్ల రైతులు అధిక కార్శీలు చేయటానకి ఇష్టపడుతున్నారు.

ఏపిలో 93 వేల హెక్టార్లలో సాగు :
ఎంతలా అంటే.. కొత్తగా నాటే మొక్కతోటల విస్తీర్ణం 36 శాతం వుంటే కార్శీతోటల విస్తీర్ణం 64 శాతం వుందని శాస్ర్తవేత్తల అంచనా. తెలుగురాష్ర్టాలలో చెరకు సాగు విస్తీర్ణం ఎక్కువగానే ఉంది. ఏపీలో 93 వేల హెక్టార్లలో సాగవుతుండగా, ఒక ఉత్తర కోస్తాలోనే 52 వేల హెక్టార్లలో సాగుచేస్తున్నారు. అందులో విశాఖ జిల్లాలోనే 32వేల హెక్టారల్లో సాగులో ఉంది. అయితే సరాసరి ఉత్పత్తి మాత్రం చాలా తక్కువగా వుంది.

ఇందుకు గల ప్రధాన కారణం మొక్క తోటల్లో సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తున్న రైతాంగం… కార్శీతోటలను నిర్లక్షం చేయటం వల్ల దిగుబడులు నామమాత్రంగా నమోదవుతున్నాయి. కార్శీ తోటల్లో కూడా మొక్కతోటలకు ధీటుగా దిగుబడులు సాధించాలంటే తప్పనిసరిగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా, అనకాపల్లి ప్రాంతాయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. టి. చిత్కాలదేవి.

కార్శీ చేసే రైతులు పోషకయాజమన్యం పట్ల కూడా కొంత అవగాహణతో ముందుకు వెళ్ళాలి. సాధారణంగా మొక్కతోటలు నాటే సమయంలో భూమిలో బస్తాలకొద్దీ ఎరువులను గుమ్మరించే మన రైతాంగం కార్శీ తోటల్లో మాత్రం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వుంటారు. దీనివల్ల మొక్క పెరుగుదలకు అవసరమైన పోషకాలు అందక… తొందరగా చీడపీడలకు లొంగిపోయి, దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి.

కార్శీ తోటల్లో కూడా సిఫారసు చేసిన ఎరువుల మోతదాను తప్పకుండా అందించాలంటారు శాస్ర్తవేత్త. కార్శీ చేసే రైతులు పోషకయాజమన్యంతో పాటు కలుపు యాజమాన్యం కూడా చాలా కీలకం. సమయానుకూలంగా సిఫార్సు చేసిన మేరకే కలుపు నివారణ రసాయన మందులను పిచికారి చేయాలి. అంతే కాదు మొక్కలు ఆరోగ్యంగా ఎదిగేందుకు అంతర కృషి చాలా అవసరం.

ట్రెండింగ్ వార్తలు