Pearl Millet : సజ్జపంట సాగులో యాజమాన్య పద్దతులు, మెళుకువలు!

సజ్జ పంట సాగుకు ఖరీఫ్‌ అంటే వర్షాకాలపు పంటగా జూన్‌, జూలై మాసాల్లో, రబీ కాలం పంటగా అక్టోబర్‌, నవంబర్‌లో, వేసవి పంటగా అయితే జనవరిలో విత్తుకోవాలి. సూటి రకాలైతే మంచి నాణ్యత గల విత్తనం ఎన్నుకోవాలి.

Pearl Millet

Pearl Millet : సజ్జ పంట మెట్ట ప్రాంత సాగుకు అనుకూలమైన చిరుధాన్యపు పంట. దీనిని పసుగ్రాసపు పంటగా కూడా చాలా మంది రైతులు సాగు చేస్తున్నారు. సజ్జ పంట అన్ని ఆహార పంటలలోకి ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకొని, అతి తక్కువ పెట్టుబడితో సాగు చేపట్టవచ్చు. సజ్జ పంట వర్షాధార ప్రాంతాలలో, ఉష్ణ ప్రదేశాలలో భూసారం తక్కువగా ఉన్న భూముల్లో మరియు నీటి నిల్వ శక్తిని తక్కువగా కలిగి ఉన్న భూముల్లో కూడా సాగు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. అత్యధిక పోషక విలువలను కలిగి ఉండి, అత్యధిక శక్తిని ఇవ్వగల ఆహార ధాన్యపు పంట.

తేలికపాటి, మధ్యరకం నేలలు, నీరు ఇంకే మురుగు నీటి పారుదల గల నేలలు సజ్జ సాగుకి అనుకూలమైనవి. మురుగు నీరు నిల్వ వుండే భూములు సజ్జ సాగుకి పనికిరావు. సజ్జ మొక్కకి భూమిలో ఉన్న క్షార గుణాలను కూడా తట్టుకొనే శక్తి కలిగి ఉండటం వల్ల అన్ని భూముల్లో ఈ పంటను సాగు చేపట్టవచ్చు. పంట వేసే ముందుగా భూమిలో ఇతర పంటల అవశేషాలను తప్పనిసరిగా తొలంగించాలి, లేని యెడల భూమి నుండి వ్యాపించే శిలీంధ్రాల వలన పంటకు నష్టం కలుగుతుంది. వేసవిలో లోతుదుక్కులు దున్నుకోవాలి. ఇలా చేయటం వలన భూమిలో ఉన్న చీడపీడలు, కలుపు మొక్క విత్తనాలు బయటపడి ఎండ వేడికి చనిపోతాయి. తద్వారా కలుపు ఉధృతిని తగ్గించ్చుకోవచ్చు.

విత్తే విధానం ; సజ్జ పంట సాగుకు ఖరీఫ్‌ అంటే వర్షాకాలపు పంటగా జూన్‌, జూలై మాసాల్లో, రబీ కాలం పంటగా అక్టోబర్‌, నవంబర్‌లో, వేసవి పంటగా అయితే జనవరిలో విత్తుకోవాలి. సూటి రకాలైతే మంచి నాణ్యత గల విత్తనం ఎన్నుకోవాలి. హైబ్రీడ్‌ ,సూటి రకాలను నమ్మకమైన సంస్థల నుంచి ధృవీకరించిన విత్తనం వాడుకోవటం మంచిది. విత్తుటకు వారం రోజుల ముందు మొలక శాతం పరీక్షించి 90 శాతం పైన ఉన్న విత్తనాన్నే విత్తనంగా వాడుకోవాలి. మొలక శాతం తక్కువగా ఉంటే, మొలక శాతాన్ని బట్టి విత్తన మోతాదును నిర్ణయించుకోవాలి.

ఒక హెక్టారుకు 4 కిలోల విత్తనం సరిపోతుంది. అంటే ఎకరాకు 1.6 కిలోలు విత్తనం సరిపోతుంది. విత్తనం నాటే ముందుగా 2% (20 గ్రా/లీ నీటికి) ఉవ్పు ద్రావణంలో విత్తనాలను 10 నిమిషాలు వుంచడం ద్వారా ఎర్గాట్‌ శిలీంద్ర అవశేసాలను తేలేటట్లు చేసి తొలగించవచ్చు. ఆరిన కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్‌ను లేదా అప్రాన్‌ 35 ఎస్‌.డి. మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు