Red caterpillar causing damage to castor bean crop, preventive measures
Castor Bean Crop : ఆముదం పంట సాగులో మనదేశం ప్రధమస్ధానంలో ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆముదం పంటను విస్తారంగా సాగు చేస్తున్నారు. ఆముదం నూనెను వైమానిక రంగంలో , జెట్, రాకెట్ పరిశ్రమల్లో లూబ్రికెంట్ గా, పాలిష్ లు, ఆయింట్ మెంట్లు , మందుల తచారీల్లోను, రంగులు, ముద్రణ కోసం తయారు చేసే సిరాతయారీలో ఉపయోగిస్తారు. అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. నీరు ఇంకే నేలలు ఈపంట సాగుకు అనువైనవి. ముఖ్యంగా ఆముదం పంటను ఆశించి నష్టం కలిగించే పురుగుల్లో ఎర్రగొంగళి ఒకటి. దీని నివారణ విషయంలో రైతులు సరైన పద్దతులు అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆముదం పంటలో ఎర్రగొంగళి పురుగు ;
ఈ పురుగు ఉదృతి జూన్ జులై మాసాల్లో పైరు మొలచిన వెంటనే అధికంగా ఉంటుంది. గొంగళి పురుగులు ఆకుల కాడలను , ఈనెలను లేత కొమ్మలను మాత్రమే మిగులుస్తాయి. ఎదిగిన గొంగళి పురుగులు ఒక పొలం నుండి మరొక పొలంలోకి గుంపులుగా వలపోయి పైరుకు నష్టం కలిగిస్తాయి. గొంగళి పురుగు ఎరుపు గోధుమ రంగు కలిగి శరీరానికి ఇరువైపులా నల్లని చారలు కలిగి ఉంటుంది. పురుగు శరీరమంతా పొడవాటి ఎరుపు గోధుమ వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. తల్లి పురగు తెలుపు రంగు రెక్కలు కలిగి రెక్కల వెలుపలి అంచు వెంట పసుపు పచ్చని చార కలిగి ఉంటుంది.
నివారణ చర్యలు ; వేసవిలో భూమిని లోతుగా దున్నుకోవాలి. లోతు దుక్కులు చేయడం వల్ల కోశస్ధదశలో భూమి లోపలి పొరల్లో దాగున్న ఎర్రగొంగళి పురుగు, శనగపచ్చ పురుగు , పొగాకు లద్దె పురుగు , వేరు పురుగులు బయటపడి ఎండ తీవ్రతకు గాని, పక్షుల బారిన పడిగాని చనిపోతాయి. భూమి తేమను నిలుపుకొనే సామర్ధ్యాన్ని పెంచకుంటుంది. కలుపు సమస్య తగ్గుతుంది. పంటను సకాలంలో విత్తుకోవచ్చు.
ఆముదానికి ముందుగా పొలంగట్లపైన అక్కడక్కడా దోస నాటడం వల్ల ఎరగా ఉపయోగపడుతుంది. తొలకరి వర్షాలు వచ్చినప్పుడు రాత్రి సమయంలో రైతులు సామూహికంగా మంటలు పెట్టడం ద్వారా దీపపు ఎరలను అమర్చటం ద్వారా రెక్కల పురుగులను అరికట్టవచ్చు. ఎదిగిన గొంగళి పురుగులు ఒక పొలం నుండి వేరొక పొలంలోకి పోకుండా పొలం చుట్టూ లోతూన నాగలి చాలును తీసి అందులో మిధైల్ పెరాధియాన్ 2శాతం , క్వినాల్ ఫాస్ 1.5 శాతం పొడి మందును చల్లి పురుగులను నివారించవచ్చు. ఎదిగిన గొంగళి పురుగుల నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా డైమిధోయట్ 2.0మి.లీ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.