Mlc Ananthababu: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు 14 రోజుల రిమాండ్.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి తరలింపు
డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు.. సాక్షులను బెదిరించి ప్రలోభాలకు గురి చేశారంటూ ఆరోపణలు వచ్చాయి.
- Naveen
- Updated on- April 25, 2026 / 05:36 PM IST
Mlc Ananthababu: డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ పడింది. 14 రోజుల రిమాండ్ విధిస్తూ కాకినాడ మొబైల్ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో అనంతబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి తరలించారు పోలీసులు. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు.. సాక్షులను బెదిరించి ప్రలోభాలకు గురి చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ నెల 21న అనంతబాబుపై కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
ఈ కేసులో భాగంగా అనంతబాబును పోలీసులు 24వ తేదీన అరెస్ట్ చేశారు. రాజమండ్రి జిల్లా కోర్టు దగ్గర కాకినాడ సర్పవరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రి జిల్లా కోర్టులో హాజరయ్యేందుకు అనంతబాబు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను రౌండప్ చేశారు. సాక్షులను బెదిరించడం, ప్రలోభాలకు గురి పెట్టిన కేసులో పోలీసులు అనంతబాబును విచారించనున్నారు.
పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని తెలియగానే గత మూడు రోజులుగా అనంతబాబు అజ్ఞాతంలో ఉన్నారు. ఎవరికీ కాంటాక్ట్ లో లేకుండా పోయారు. దీంతో నాలుగు బృందాలుగా పోలీసులు రంగంలోకి దిగారు. అనంతబాబు కోసం ముమ్మరంగా గాలించారు. ఈ క్రమంలో కోర్టు దగ్గరికి వచ్చిన అనంతబాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్న నలుగురు సాక్షులను అనంతబాబు భయపెట్టి, ప్రలోభాలకు గురి చేశారని అభియోగం ఉంది. డబ్బు ఆశ చూపడమే కాకుండా చెప్పిన మాట వినకపోతే చంపేస్తానని బెదిరించినట్లు సాక్షులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అనంతబాబుతో పాటు అతడి ముగ్గురు అనుచరులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి..! కొత్త పార్టీపై కీలక ప్రకటన.. టార్గెట్ వారేనా..? ఎవరికి నష్టం..
