Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
అమలాపురంలో నిన్న విధ్వంసానికి పాల్పడిన వారిలో 46 మందిని అరెస్ట్ చేసినట్లు హోం మంత్రి తానేటి వనిత చెప్పారు.
- chvmurthy
- Published On : May 25, 2022 / 09:27 PM IST
Taneti Vanitha
Konaseema : అమలాపురంలో నిన్న విధ్వంసానికి పాల్పడిన వారిలో 46 మందిని అరెస్ట్ చేసినట్లు హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. ఈరోజు ఆమె విలేకరులతో మట్లాడుతూ…. అమలాపురం సంఘటనపై డీజీపీ తో సమీక్షించడం జరిగిందని చెప్పారు.ఆందోళనలు జరగకుండా అడిషనల్ డీజీ, డీఐజి, ఎస్పీ లను, అదనపు బలగాలను పంపించామని..పోలీసులు పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చారని తెలిపారు.ప్రజలెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరూ ధైర్యంగా ఉండొచ్చన్నారు.
గతంలో 7 కు పైగా కేసులు ఉన్న వారిని 72 మందిని పోలీసులు గుర్తించారని వీరిలో 46 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు మంత్రి వివరించారు.మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగిందని.. నిరసనకారులు మంత్రి, ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఆందోళనకారులు దాడి చేస్తున్నప్పటికీ పోలీసులు సంయమనం పాటించి ప్రాణనష్టం జరగకుండా, ప్రజలకు, ఆందోళనకారులు ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారని వనిత అన్నారు.
పోలీసులు తాము గాయపడినప్పటికి ప్రజలకు రక్షణగా ఉంటూ.. ఆందోళనకారులను అదుపుచేశారని మంత్రి చెప్పారు. నిన్న పోలీసులు వ్యవరించిన తీరే ఫ్రెండ్లీ పోలీసింగ్ కు నిదర్శనమన్న మంత్రి పోలీసులను అభినందించారు.ప్రజలెవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి అప్రమత్తంగా వున్నారని మంత్రి తెలిపారు.
