Shanthi Arrest: ఏపీ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్..
విశాఖ ఎండాడలో లగ్జరీ ప్లాట్, తాడేపల్లి కుంచనపల్లిలో జీ ప్లస్ భవనంతో పాటు 770 గ్రాముల బంగారు నగలు, 3 కిలోల వెండిని ఏసీబీ గుర్తించింది.
- Naveen
- Published On : April 7, 2026 / 08:58 PM IST
Shanthi Arrest: ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తాడేపల్లి, ఉండవల్లి సహా నాలుగు ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో శాంతి భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. విశాఖ ఎండాడలో లగ్జరీ ప్లాట్, తాడేపల్లి కుంచనపల్లిలో జీ ప్లస్ భవనంతో పాటు 770 గ్రాముల బంగారు నగలు, 3 కిలోల వెండిని ఏసీబీ గుర్తించింది. అంతే కాకుండా పలు బ్యాంకు ఖాతాల్లో నగదు ఉన్నట్లు తేల్చింది. దీంతో శాంతిని అరెస్ట్ చేసింది ఏసీబీ. విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఆమెను హాజరుపరచబోతున్నారు.
ఇవాళ ఉదయం నుంచి శాంతి ఇళ్లు, ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేశారు. పలు ప్రాంతాల్లో ఆమెకు విలువైన భూములు, ఇళ్లు, ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. స్తిరాస్తులు, నగదు, బంగారం, వాహనాలు ఉన్నట్లు తెలుసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో కోట్లాది రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఇక బ్యాంకు ఖాతాలు, లాకర్లు, ఇతర పెట్టుబడులకు సంబంధించిన కీలక పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఉదయం నుంచి సోదాలు చేసిన అధికారులు రాత్రి సమయంలో తాడేపల్లిలోని ఆమె నివాసం దగ్గరే శాంతిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆమెను రిమాండ్‌కు కోరనున్నట్లు సమాచారం. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతి అత్యంత వివాదాస్పద అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. భక్తుల సొమ్మును, ఆలయ భూములను రక్షించాల్సిన అధికారిణి తన పదవిని అడ్డం పెట్టుకుని ఇలా అక్రమాలకు పాల్పడటం కలకలం రేపుతోంది.
Also Read: ఈ రాత్రికే ఇరాన్ అంతం..! ట్రంప్ మరో డెడ్లీ వార్నింగ్
