AE Nookaraju Family Case : ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసు.. సైనైడ్ కలిపింది అతనే..! పోలీసుల విచారణలో సాధిక్‌ఖాన్ సంచలన విషయాలు..
Kakinada Family Suicide Case : కాకినాడ జిల్లాలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాధిక్ ఖాన్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- Harish Thanniru
- Published on- September 11, 2026 / 09:16 AM IST
Kakinada Family Suicide Case
Kakinada Family Suicide Case : తెలుగు రాష్ట్రాల్లో కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ టి. నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు సంచలనంగా రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read : AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో రెండ్రోజులు భారీ వర్షాలు.. భీకర గాలులు..
రిమాండ్‌లో ఉన్న సాధిక్‌ను కోర్టు అనుమతితో మూడు రోజులుగా కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు విచారిస్తున్నారు. తొలి రెండు రోజులు పోలీసులు అడిగిన ప్రశ్నలకు నిందితుడు సాధిక్ నుంచి సరియైన స్పందన రాలేదు. అయితే, పోలీసులు సాంకేతిక ఆధారాలు చూపడంతోపాటు, నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డిని చంపడానికి సైనైడ్ విక్రయించిన వారి సాక్ష్యం గురించి చెప్పడంతో సాధిక్ నిజం ఒప్పుకొని అసలు విషయం చెప్పాడు.
నిందితుడు సాధిక్ ఖాన్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. జగదీశ్వరరెడ్డి భార్య సౌజన్యను పెండ్లి చేసుకొని పెద్దమొత్తంలో ఆస్తిని కొట్టేయాలని భావించా. ఈ క్రమంలో జగదీశ్వరరెడ్డికి విషపదార్థం ఇచ్చి చంపాలని అనుకున్నా. దీంతో ఓసారి కొబ్బరి నీళ్లలో విషపదార్థాన్ని కలిపి ఇచ్చా. కాకినాడ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నప్పుడే మూడు నాలుగు సార్లు ఇచ్చాం. వాటితో ఆరోగ్యం పాడై చనిపోతాడనుకున్నాం. హైదరాబాద్ ఆసుపత్రిలో చేరి కొంత కోలుకుని బయటకు వచ్చాక సైనైడ్ పంపించాను. అది ఉపయోగించడంతో మర్నాడు చనిపోయాడని సాధిక్ చెప్పినట్లు సమాచారం. అయితే, సాధిక్ ఉపయోగించిన విష పదార్థం నమూనాలను సీజ్ చేశారు.
అయితే, జగదీశ్వరరెడ్డి మరణం తరువాత సౌజన్యను పెళ్లి చేసుకుంటే కోట్లలో ఆస్తి వస్తుందని అనుకున్నానని, కానీ, ఆమె తండ్రి నూకరాజు అందుకు ఒప్పుకోలేదని పోలీసుల విచారణలో సాధిక్ చెప్పినట్లు సమాచారం. ఆస్తిని మనవడితో పాటు కుటుంబంలో వేరొకరి పేరున రాస్తానని నూకరాజు చెప్పాడు. ఆస్తి కోసమే నేను ఇంతాచేస్తే మీరు ఇలా చేయడాన్ని అంగీకరించనని గొడవ పడ్డాను. చంపేస్తానన్నాను. అంతేగానీ వారు ఆత్మహత్య చేసుకుంటారని ఊహించలేదని సాధిక్ పోలీసుల ఎదుట వెల్లడించినట్లు తెలిసింది.
ఇదిలా ఉంటే.. ఈ కేసులో సాధిక్ ఖాన్ వెల్లడించిన అంశాలను పోలీసులు ఇతర ఆధారాలతో సరిపోల్చి చూస్తున్నారు. సాంకేతిక ఆధారాలు, విషపదార్థాల నమూనాలు, సైనైడ్ విక్రేతల వాంగ్మూలాలతో పాటు ఇతర ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. పోలీసుల పూర్తి దర్యాప్తు అనంతరం ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
