Ap Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతి కొత్త కళ సంతరించుకోనుంది. అమరావతి రాజధాని పనులకు త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాల పటిష్టతపై నిపుణులతో ప్రభుత్వం సర్వేలు నిర్వహిస్తోంది. తొలి దశలో పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లను తొలగించే పనులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. 94 ప్రొక్లైన్లతో 25 ప్రాంతాల్లో జంగల్ క్లియరెన్స్ చేస్తోంది. మిగిలిన పనులను త్వరలోనే ప్రారంభిస్తారు.
మరోవైపు రాజధానిలో జరిగిన చోరీలపై విచారించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మంత్రివర్గంలో చర్చించిన తర్వాత రాజధాని రైతులకు పాక్షిక కౌలు చెల్లించాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్.. నిలిచిపోయిన పనుల నిర్మాణాలను సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఏపీ రాజధాని అమరావతి.. కూటమి విజయంతో కొత్త రూపం సంతరించుకోబోతోంది. అమరావతిలో సీఆర్డీయే ఆగమేఘాలపై పనులు మొదలుపెట్టింది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు 3 రోజులుగా జరుగుతున్నాయి. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుండటంతో అప్పటిలోగా అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో గతంలో నిర్మించిన నిర్మాణాల పటిష్టత ఏ విధంగా ఉందో తేల్చేందుకు ఇంజినీరింగ్ నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేయబోతోంది ప్రభుత్వం. ఆ నివేదిక వచ్చాక పనులు మొదలు కాబోతున్నాయి.
ఇక కరకట్టపై వెలగని విద్యుత్ దీపాలకు సైతం సీఆర్డీయే సిబ్బంది రిపేర్లు చేస్తున్నారు. కరకట్ట రోడ్డుపై వెలగని 32 దీపాలను.. మిగిలిన రోడ్లపై మరో 55 లైట్లు అమర్చారు. సీడ్ యాక్సిస్ రోడ్డుపై రెండు దశల్లో 9.60 కోట్లతో ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్ట్ ను పూర్తి చేశారు. వెంకటపాలెం నుంచి రాయపూడి వరకు మొత్తం 9 కిలోమీటర్ల మేర ఈ మార్గంలో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. కరకట్ట రోడ్డు, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల నివాసాలకు వెళ్లేందుకు మార్గాలు లేవు. నిర్మాణంలో ఉన్న న్యాయమూర్తుల బంగ్లాలు, న్యాయ సముదాయం, సచివాలయం టవర్లు, ఎన్జీవో అపార్ట్ మెంట్లకు వెళ్లే మార్గాల్లో ముళ్ల చెట్లను కూడా తొలగిస్తున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అమరావతిలో పనులు మరింత వేగవంతం కానున్నాయి.