కోట్లాది మంది భక్తులు షాక్ అయ్యారు.. మహా పాపం చేశానని చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: సజ్జల
"తిరుమల లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు లేదని తెలియగానే ఇప్పుడు మళ్లీ కెమికల్స్ అంటూ కొత్త ప్రచారం మొదలెట్టారు" అని తెలిపారు.
Sajjala Ramakrishna Reddy
- తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్నారు
- జంతువుల కొవ్వు లేదని రిపోర్ట్స్‌లో తేలింది
- రాజకీయ కక్షతోనే వైసీపీపై అన్యాయంగా ఆరోపణలు
Sajjala Ramakrishna Reddy: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న మాటతో వివాదం మొదలైందని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జాతీయ ల్యాబ్ రిపోర్టులు ఎలాంటి జంతువుల కొవ్వు లేదని తేల్చాయని వివరించారు. రాజకీయ కక్షతోనే వైసీపీపై అన్యాయంగా ఆరోపణలు చేశారని చెప్పారు.
“రాజకీయాలు ఎలా ఉన్నా కోట్లాది మంది భక్తులు షాక్ అయ్యారు. మహా పాపం చేశానని, తన వల్ల తప్పు జరిగిందని చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. జంతువుల కొవ్వు లేదని తెలియగానే ఇప్పుడు మళ్లీ కెమికల్స్ అంటూ కొత్త ప్రచారం మొదలు పెట్టారు.
సుప్రీంకోర్టు డైరెక్షన్ లో సీబీఐ విచారణ జరుగుతుంది.. ఇన్వెస్టిగేషన్ అయ్యాక నిజాలు తెలుస్తాయి. ల్యాబ్ రిపోర్ట్స్ లో కెమికల్స్ కలిపినట్టు ఎక్కడా లేదు. కెమికల్స్ కలిపి నెయ్యి చెయ్యడం వీలు అవుతుందా? అలాంటి వాటితో లడ్డూ తయారుచేస్తే రెండు రోజులైనా ఉంటుందా? నెయ్యి వాసన.. కెమికల్స్ వాసన తెలిస్తుంది కదా?
వచ్చిన ఆరోపణలపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.. టీటీడీ స్వతంత్ర సంస్థ.. ప్రభుత్వ ప్రమేయం ఉండదు.. బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అవుతారు. టీటీడీకి మా హయాంలో అన్ని రకాలుగా బెస్ట్ సపోర్ట్ ఇచ్చాం. కల్తీ జరిగిందా..? జరగలేదా..? ఎవరు చెప్పలేం.. విచారణలో తేలాలి. 2019 నుంచి మా హయాంలో బోలె బాబా ఎక్కడా సప్లై చెయ్యలేదు.
బ్లాక్ లిస్టులో ఉంది. బోలే బాబాకి అనుమతి ఇచ్చినది గత టీడీపీ హయాంలో. శాంపిల్స్ తీసింది ప్రస్తుత చంద్రబాబు పాలనలో. జంతువుల కొవ్వు లేదని తెలిసింది. హమయ్య అని ఇప్పుడు కూడా ఎవరూ అనుకోకుండా ఇంకా కల్తీ జరిగిందంటూ విష ప్రచారం చేస్తున్నారు” అని అన్నారు.
