మండలి రద్దు..? : ఏపీ కేబినెట్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ

సోమవారం(జనవరి 27,2020) నిర్వహించనున్న కేబినెట్‌ భేటీపై ఏపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో మండలి రద్దుపై తీర్మానం చేస్తారనే వార్తలు ఇప్పుడు ఏపీ

  • Publish Date - January 25, 2020 / 01:50 AM IST

సోమవారం(జనవరి 27,2020) నిర్వహించనున్న కేబినెట్‌ భేటీపై ఏపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో మండలి రద్దుపై తీర్మానం చేస్తారనే వార్తలు ఇప్పుడు ఏపీ

సోమవారం(జనవరి 27,2020) నిర్వహించనున్న కేబినెట్‌ భేటీపై ఏపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో మండలి రద్దుపై తీర్మానం చేస్తారనే వార్తలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఒకవేళ మండలి రద్దు చేయాలని జగన్‌ సర్కార్‌ భావిస్తే.. కేబినెట్‌ భేటీలో తీర్మానం చేసి.. ఆ వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఏపీలో ఇదే విషయం చర్చనీయాంశమైంది. 

కేబినెట్ లో తుది నిర్ణయం..అసెంబ్లీలో ఆమోదం..?
ఏపీ కేబినెట్ సోమవారం సమావేశం కానుంది. శాసనమండలి ఉండాలా? వద్దా? అనే అంశంపై శాసనసభలో చర్చిద్దామని ఏపీ సీఎం జగన్ ప్రకటన చేసిన నేపథ్యంలో… సోమవారం జరగబోయే కేబినెట్‌ భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో శాసనమండలి రద్దు అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకుని… ఆ వెంటనే దీనిపై శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

అసలు మండలి అవసరమా..?
ఏపీలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును శాసనసభ ఆమోదించినా… శాసనమండలిలో ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ నిర్ణయించడంపై వైసీపీ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. మండలి చైర్మన్, టీడీపీ సభ్యుల తీరును తీవ్రంగా తప్పుబడుతున్న వైసీపీ ప్రభుత్వం… అసలు మండలి అవసరమా? అనే చర్చకు తెరలేపింది. దీనిపై సోమవారం చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం జగన్ ప్రకటించడంతో… ఆ రోజే మండలి రద్దుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జోరందుకుంది.

* సోమవారం ఉ.9.30గం.లకు ఏపీ కేబినెట్ భేటీ
* మండలి రద్దుపై కేబినెట్‌లో చర్చించే అవకాశం
* సోమవారం ఉ.11గం.లకు సమావేశం కానున్న అసెంబ్లీ
* మండలి రద్దుపై చర్చించనున్న అసెంబ్లీ