జడ్పీటీసీ ఉపఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.. వైసీపీ బైకాట్.. ఫలితాలపై ఉత్కంఠ..
కడప జిల్లాలో ఆసక్తికరంగా మారిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి ఫలితాలు మరికొద్ది సేపట్లో వెల్లడి కానున్నాయి.

ZPTC By Elections
ZPTC By Elections: కడప జిల్లాలో ఆసక్తికరంగా మారిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి ఫలితాలు మరికొద్ది సేపట్లో వెల్లడి కానున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను కడప నగర శివారులోని ఉర్దూ నేషనల్ యూనివర్శిటీలో నిర్వహిస్తున్నారు.
ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రెండు మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. పులివెందుల ఉప ఎన్నికల కౌంటింగ్ కోసం 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా.. ఒకే రౌండ్‌లో ఫలితం తేలిపోనుంది. మరోవైపు.. ఒంటిమిట్ట ఉప ఎన్నికలకు 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా.. మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్‌ను వైసీపీ బైకాట్ చేసింది. ఇప్పటికే గురువారం జరిగిన రీపోలింగ్‌ను వైసీపీ బహిష్కరించిన విషయం తెలిసిందే. కౌంటింగ్ కేంద్రాలకు పులివెందుల టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, ఒంటిమిట్ట అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి చేరుకున్నారు. టీడీపీ, స్వతంత్ర అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో రెండు జడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు వెల్లడి కానున్నాయి.
మంగళవారం పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ జరిగింది. బ్యాలట్ పద్దతిలో జరిగిన ఈ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు జరిగింది. పులివెందులలో 76.44శాతం, ఒంటిమిట్టలో 81.53శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. అయితే, పోలింగ్ సమయంలో పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
ఈ క్రమంలో పోలింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందడంతో.. పులివెందుల జడ్పీటీసీ పరిధిలో 3, 14 పోలింగ్ కేంద్రాల్లో (అచ్చివెల్లి, ఇ.కొత్తపల్లి) బుధవారం మరోసారి రీ పోలింగ్ నిర్వహించారు. దీంతో అచ్చవెల్లిలో 68.50శాతం, ఇ.కొత్తపల్లిలో 54.28శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం రెండు జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి.