Pulivendula: పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయం.. డిపాజిట్ కోల్పోయిన వైసీపీ అభ్యర్థి
పులివెందుల (Pulivendula) జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి దాదాపు 5వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

Pulivendula
Pulivendula ZPTC Bye Election: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీ పాగా వేసింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,033ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
పులివెందుల జడ్పీటీసీ స్థానంలో మొత్తం 10,601 ఓట్లు కాగా.. మొత్తం 7,814 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి 6,716 ఓట్లు పోలవ్వగా.. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయాడు. 30ఏళ్ల తరువాత పులివెందులలో టీడీపీ విజయం సాధించింది. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీకి 100లోపు ఓట్లు లభించాయి. ఈ స్థానానికి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 11 మంది పోటీపడ్డారు.
ఘన విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి లతారెడ్డిని మంత్రి సవిత అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది. స్వాంతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందే పులివెందులకు స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల కోటను బద్దలు కొడతామని మంత్రి సవిత అన్నారు.
మంగళవారం పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ జరిగింది. బ్యాలెట్ పద్దతిలో జరిగిన ఈ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు జరిగింది. పులివెందులలో 76.44శాతం, ఒంటిమిట్టలో 81.53శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. అయితే, పోలింగ్ సమయంలో పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
ఈ క్రమంలో పోలింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందడంతో.. పులివెందుల జడ్పీటీసీ పరిధిలో 3, 14 పోలింగ్ కేంద్రాల్లో (అచ్చివెల్లి, ఇ.కొత్తపల్లి) బుధవారం మరోసారి రీ పోలింగ్ నిర్వహించారు. దీంతో అచ్చవెల్లిలో 68.50శాతం, ఇ.కొత్తపల్లిలో 54.28శాతం పోలింగ్ నమోదైంది. గురువారం రెండు జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. పులివెందుల జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు.