ఏపీ ప్రజలను వణికిస్తున్న వానలు.. నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. జలదిగ్భందంలో పలు ప్రాంతాలు
ఏపీలో వచ్చే నాలుగు రోజులు వర్షాలు పడనున్నాయి. ఆ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Heavy Rains
Heavy Rains in AP: ఏపీలో వర్షాలు (Rains in AP) దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురవగా.. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షం పడింది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నగరాల్లో పలు ప్రాంతాలు చెరువులను తలపించాయి. రోడ్లపై రెండుమూడు అడుగుల ఎత్తుకుపైగా నీరు ప్రవహించింది. గుంటూరు పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకుంది. అయితే, మరో నాలుగు రోజులు ఏపీలో వర్షాలు దంచికొడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు, బాపట్ల, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లోని స్కూళ్లుకు సెలవులు (School holidays) ప్రకటించారు.
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ గురువారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
తరువాత రెండు రోజుల్లో ఈ అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ కారణంగా ఏపీలో వచ్చే నాలుగు రోజులు వర్షాలు పడనున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ (గురువారం) ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అనంతపురం, వైఎసఆర్ కడప, కర్నూలు, నంద్యాల, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
గరిష్ఠంగా గంటకు 50 నుంచి 60కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్రంలోని విశాఖపట్టణం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులకు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం మూడో నవంబరు హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకుతోడు మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో వర్షాలపై సమీక్ష నిర్వహించారు. వాగుల ద్వారా వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ఆయా శాఖల సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
మరోవైపు.. ప్రకాశం బ్యారేజ్ కు వద్ద వరద క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ ప్లో, ఔట్ ప్లో 4.50 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణం చేయొద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయొద్దని సూచించారు. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రఖర్ జైన్ సూచించారు.