AP Govt : ఏపీలోని ఆ ప్రాంతాల రైతులకు శుభవార్త.. మే 1 నుంచి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ..
AP Govt : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు మే 1వ తేదీ నుంచి కౌలు సొమ్మును నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేసేందుకు చర్యలు చేపట్టింది.
- Harishth Thanniru
- Updated on- April 26, 2026 / 10:04 AM IST
Amaravati farmers
- ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
- రెండో విడతలో భూములిచ్చిన రైతులకు మే 1 నుంచి కౌలు
- నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమకానున్న నగదు
AP Govt : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో నెలకొన్న స్తబ్దతను తొలగిస్తూ చర్యలు చేపట్టింది. రెండో విడత భూ సమీకరణలో భాగంగా రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు మే 1వ తేదీ నుంచి కౌలు సొమ్మును నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలో అంతర్జాతీయ క్రీడా నగరం, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్, రైల్వే స్టేషన్ కోసం 16,667 ఎకరాల భూమిని ఏడు గ్రామాల్లో సమీకరిస్తున్నామని అధికారులు మృతి దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం ఎనిమిది ల్యాండ్ పూలింగ్ యూనిట్లలో ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నామని వివరించారు.
రాజధాని 29 గ్రామాల్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) పెంపుపై పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ అధ్యయనం చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా ఎఫ్ఎస్ఐ పెంపుపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
అలాగే పురపాలక సంస్థల్లోని డంపింగ్ యార్డుల వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి నగరాలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
