అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసిన ఆయన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ చేసినట్లు తెలుస్తోంది.ఇవాళ లేదా రేపు ఆయన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముంది. గురువారం(ఫిబ్రవరి-14,2019) మధ్యాహ్నాం హైదరాబాద్ లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో ఆయనతో అవంతి భేటీ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అవంతి తన గన్ మెన్స్ ని కూడా వెనక్కి పంపించేశారు. అవంతి శ్రీనివాస్ తో పాటు మరో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
2009లో పీఆర్పీ తరుపున అవంతి శ్రీనివాస్ భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. భీమిలి నియోజకవర్గంపై పట్టు సాధించుకున్నారు. 2014 ఎన్నికల్లో కూడా భీమిలి నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే చంద్రబాబు అనకాపల్లి ఎంపీగా పోటీకి ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ భీమిలి టికెట్ పై హామీ ఇవ్వడంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.