Anantapur : ఇలాంటోళ్లతో భద్రం.. అడ్రెస్ అడుగుతారు.. చేతిలో రూ.500 కాగితం పెడతారు.. కట్ చేస్తే ఒంటి మీద బంగారం స్వాహా..
Anantapur : కేటుగాళ్లు ఎంతకు తెగిస్తున్నారో.. జనాలను మోసం చేయడానికి ఎలాంటి కొత్త పద్దతులు ఫాలో అవుతున్నారో ఇది చదివితే అర్థం అవుతుంది.
- Dharani Pilli
- Updated on- April 17, 2026 / 04:21 PM IST
anantapur strangers drugged woman with sedatives and robbed her gold
- కేటుగాళ్ల నయా పంథా
- అడ్రెస్ అడిగి మత్తు మందిచ్చి దోచుకుంటారు
- అనంతరపురంలో వెలుగు చూసిన ఘటన
Anantapur : ఈజీ మనీకి అలవాటు పడ్డవారు కష్టపడాలంటే బద్ధకిస్తారు.. అదే జనాలను మోసం చేసి పబ్బం గడుపుకోవాలంటే మాత్రం ఎక్కడా లేని చావు తెలివితేటలన్నింటినీ ఉపయోగించి మరి కొత్త ట్రిక్కులు కనిపెడతారు. తాజాగా ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లాలో ఈ తరహాకు చెందిన కేటుగాళ్ల మోసం ఒకటి తెర మీదకు వచ్చింది. వీరు చూడటానికి చాలా మంచి వారి లాగా కనిపిస్తారు. ఎంతో అమాయకంగా మన దగ్గరకు వచ్చి ఫలానా అడ్రెస్ చెప్పమని కోరతారు. ఇంతలో మరో వ్యక్తి వచ్చి “ప్లీజండి కాస్త ఈ నోటు పట్టుకోండి” అని మీ చేతిలో రూ.500, అంతకన్నా పెద్ద కరెన్సీ నోటో పెడతారు. అక్కడితో వారి ప్లాన్ అయిపోతుంది. కాసేపటికి మీ ఒంటి మీద బంగారం మాయం అవుతుంది. అసలేంటి కేటుగాళ్ల నయా దందా అంటే..
ఒకప్పుడు తినే పదార్థాల్లో మత్తు మందు కలిపి అమాయకులను మోసం చేసే కేటుగాళ్లు ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. కరెన్సీ నోట్లను ఉపయోగించి జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఈ తరహా మోసం ఒకటి వెలుగు చూసింది. అనంతపురం జిల్లా, రామచంద్ర నగర్‌కు చెందిన ఓ మహిళ ఈ మోసానికి బలయ్యారు. పనిమీద నగరంలో తిరుగుతున్న ఆమెను దొంగల ముఠా గమనించింది. బస్టాండు దగ్గర నిల్చుని ఉన్న ఆమె దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకతను హిందీలో ఆమెని అడ్రెస్ అడగ్గా.. తనకు తెలియదని బాధితురాలు సమాధానం చెప్పింది. ఇంతలో మరో వ్యక్తి వచ్చి 500 రూపాయల నోటు తీసి ఆమెకిచ్చాడు. అతను ఎందుకిచ్చాడో అర్థం కాని మహిళ.. తిరిగి ఆ నోటును వారికే ఇచ్చింది.
కొద్ది దూరం నడిచిన తర్వాత బాధితురాలు అనుకోకుండా చేయి తీసుకెళ్లి ఆమె ముక్కు దగ్గర పెట్టుకుంది. ఇంకేముంది స్పృహతప్పి పడిపోయింది. మహిళనే గమనిస్తున్న మోసగాళ్లు ఆమె కింద పడగానే పరుగున దగ్గరకు వచ్చి ఆమెకు సపర్యలు చేస్తున్నట్లు నటించి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు, ఉంగరాన్ని దోచుకుని పారిపోయారు. మత్తు దిగిన తర్వాత చూసుకుంటే తన నగలు లేవని గుర్తించింది. ఇంటికి వెళ్లి జరిగిన సంగతి చెప్పగా.. ఆమె ప్రాణాలతో బయటపడ్డందుకు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదుతో సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్‌లలో ఇద్దరు, ముగ్గురు యువకులు ఆమెను సమీపించి, మాట్లాడి, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని పోలీసులు వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. అనంతపురంలో మరోచోట కూడా ఇలాంటి ఘటనే జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అపరిచితులు ఇచ్చే వస్తువులను ముట్టుకోవడం, తాగడం, తినడం వంటి వాటికి దూరంగా ఉండాలని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు.
