ఎవరి సీట్లు ఉంటాయో, ఎవరి సీట్లు గల్లంతవుతాయో.. శ్రీకాకుళం జిల్లా టీడీపీలో టెన్షన్
వైసీపీ వచ్చిన తర్వాత జగన్ తెలుగుదేశం కోటలకు బీటలు వారేలా చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పది స్థానాల్లో ఎనిమిది వైసీపీ కైవసం చేసుకోగా.. ఇచ్ఛాపురం, టెక్కలి మాత్రమే టీడీపీకి దక్కాయి.
- Naga Srinivasa Rao Poduri
- Published On : January 22, 2024 / 10:43 AM IST
andhra pradesh elections 2024 srikakulan telugudesam party leaders tension
TDP Tension: ఎన్నికలు తరుముకొస్తున్న వేళ వైసీపీ జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తుంటే టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. తమ పార్టీ అధినేత చంద్రబాబు ఇంకా లిస్టులు బయటపెట్టడేమని వాపోతున్నారు. సరిగ్గా శ్రీకాకుళం జిల్లా టీడీపీలో ఇదే పరిస్థితి నెలకొంది. తమ సీట్లపై ఇంకా క్లారీటీ రాకపోడంతో ఏం జరగబోతుందోనని మదన పడుతున్నారు తెలుగు తమ్ముళ్లు.
ఏపీలో టీడీపీకి గట్టి పట్టున్న జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఈ సిక్కోలు జిల్లాలో టీడీపీ ఆధిపత్యం కొనసాగిస్తూనే వస్తోంది. ఈక్రమంలో గడచిన మూడు దశాబ్ధాల కాలంలో టీడీపీ నుంచి ఎంతో మంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇదంతా 2019కి ముందు చరిత్ర. వైసీపీ వచ్చిన తర్వాత జగన్ తెలుగుదేశం కోటలకు బీటలు వారేలా చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పది స్థానాల్లో ఎనిమిది వైసీపీ కైవసం చేసుకోగా.. ఇచ్ఛాపురం, టెక్కలి మాత్రమే టీడీపీకి దక్కాయి.
2024 ఎన్నికల్లో ఎలాగైనా జిల్లాలో పైచేయి సాధించాలని చూస్తున్న టీడీపీ నాయకులు.. పార్టీ అధినాయకత్వం వైపు చూస్తున్నారు. పార్టీ నాయకుడు చంద్రబాబు నుంచి ఎప్పుడు కాల్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. పైగా జనసేనతో పొత్తు ఉందన్న నేపథ్యంలో ఎవరి సీట్లు ఉంటాయో, ఎవరి సీట్లు గల్లంతవుతాయోనని టెన్షన్ పడుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో గత ఎన్నికల్లో పోటీ చేసిన పాత నేతలే ప్రస్తుతానికి టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌లుగా కొనసాగుతున్నారు. అయితే చాలా నియోజకవర్గాల్లో కొత్త నాయకులు పుట్టుకొచ్చారు. ప్రస్తుత ఇంచార్జీలతో సమానంగా పని చేస్తూ ముందుకు దూసుకువెళుతున్నారు. దీంతో అక్కడక్కడ ముఠాలు కూడా ఏర్పాటయ్యాయి. అవిప్పుడు టీడీపీకి తలనొప్పిగానూ మారాయి. కొత్త తరం నేతలు కొందరు ఇప్పటికే తమకే సీట్లంటూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు.
Also Read: వైఎస్ షర్మిల స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి? కాంగ్రెస్‌కు కొత్త ఊపు వచ్చినట్టేనా?
ఎచ్చెర్ల ఇంచార్జిగా సీనియర్ నేత.. పాలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావ్ ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి కలిశెట్టి అప్పల నాయుడు.. కిమిడితో పోటీ పడుతున్నారు. సీటు తనదే అంటున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఇంచార్జిగా జి.లక్ష్మీదేవి పని చేస్తుండగా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోండు శంకర్ పోటీ పడుతున్నారు. పాతపట్నంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే కలమట రమణకు పోటీగా.. మామిడి గోవింద్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాలలో కొత్త తరం పాత తరానికి సవాల్ విసురుతోంది. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు మనసులో అసలేముందనేది అర్థం కాక టెన్షన్ పడుతున్నారు.
