AP Govt Promotions : ప్రభుత్వ ఉద్యోగులకు AP సర్కార్ శుభవార్త.. ప్రమోషన్ల అంశంపై కీలక నిర్ణయం..
AP Govt Promotions : ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
- Dharani Pilli
- Updated on- May 3, 2026 / 05:48 PM IST
andhra pradesh government decide to complete employee promotions process and issue deadline
AP Govt Promotions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారి ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. మే 4, సోమవారం నుంచి పదోన్నతి అంశంతో పాటు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లను సోమవారం లోపే పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించింది. ముఖ్యంగా కమర్షియల్ టాక్స్ శాఖతో పాటు అన్ని హెచ్ఓడీల్లో గెజిటెడ్ పోస్టుల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించింది.
లోకల్ క్యాడర్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన కొత్త ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్ చట్టం అమల్లోకి రాకముందే ఈ ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. అలానే భవిష్యత్తులో సీనియారిటీకి సంబంధించిన సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కూటమి సర్కార్ ప్రత్యేక క్లియరెన్స్ డ్రైవ్‌ను చేపట్టి.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్ణయించిన తేదీలోగా పదోన్నతల వ్యవహారాన్ని పూర్తి చేయాలని సూచించింది.
ఇదిలా ఉండగా.. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల అంశంలో ఈ-డీపీసీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు మరింత పారదర్శకం చేసింది. ఈ-డీపీసీ వల్ల ఏప్రిల్, ఆగస్టులో పదోన్నతులు రావాల్సిన వారికి ముందుగానే నవంబరు, డిసెంబరులో వచ్చాయి. కానీ, అన్ని స్థాయిలలో, అన్ని శాఖల్లో ఇది జరగడం లేదు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగులు తెలిపారు. దీంతో త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
