IAS Transfers: ఆంధ్రప్రదేశ్‌లో IAS అధికారుల బదిలీలు.. ఏకంగా 11 మందికి కొత్త బాధ్యతలు.. కీలక జీవో జారీ
ఆంధ్రప్రదేశ్‌లో ఆమ్రపాలి కాటా, సౌరభ్ గౌర్ సహా 11 మంది ఐఏఎస్ (IAS Transfers) అధికారులకు కొత్త బాధ్యతలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- V Santhosh Kumar
- Updated on- October 12, 2026 / 03:33 PM IST
Andhra Pradesh government has transferred 11 IAS officers
Andhra Pradesh IAS Transfers: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా రాష్ట్ర ప్రభుత్వం పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తూ పలువురు ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు కేటాయించింది. పాలనను మరింత వేగవంతం, సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా సాధారణ పరిపాలన శాఖ నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 11 మంది ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు కేటాయించగా, వారిలో తొమ్మిది మందికి నూతన పోస్టింగ్‌లు, మరో ఇద్దరు అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది.
Read Also – Starlink Security: నువ్వెవరు మస్క్ మాకు చెప్పడానికి? స్టార్ లింక్ అసలు సేఫేనా? అది చెప్పు
కీలక శాఖల్లో నూతన నియామకాలు.. ఆమ్రపాలి, సౌరభ్ గౌర్‌లకు ప్రాధాన్యం:
నూతన నియామకాల వివరాల ప్రకారం.. 2002 బ్యాచ్‌కు చెందిన సౌరభ్ గౌర్ న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ఓఎస్‌డీగా నియమితులయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా డి. మురళీధర్ రెడ్డి, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శిగా మంజుల బాలాజీ దిగంబర్ బాధ్యతలు చేపట్టనున్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలి కాటా, యువజన సేవల సంచాలకుడిగా కె. నీలకంఠ రెడ్డి నియమితులయ్యారు. పరిశ్రమల శాఖ జాయింట్ సెక్రటరీగా బి. అనిల్ కుమార్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ గురుకుల కార్యదర్శిగా ఎన్. తేజ్ భరత్, పౌర సరఫరాల సంస్థ విసి & ఎండిగా వర ప్రసాద్, స్వర్ణ గ్రామం ఉప కార్యదర్శిగా గెడేల శ్రీను కుమార్ నియమితులయ్యారు.
అదనపు బాధ్యతల్లో ఇద్దరు అధికారులు.. తక్షణమే అమలులోకి ఉత్తర్వులు:
మరోవైపు ఇద్దరు ఐఏఎస్(IAS Transfer) అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు కేటాయించారు. హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులుకు వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకుడిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా ఉన్న శుభమ్ బన్సల్ ఏపీ రాష్ట్ర ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ నూతన పోస్టింగ్‌ల ఉత్తర్వులన్నీ తక్షణమే అమలులోకి వస్తాయని సాధారణ పరిపాలన శాఖ వెల్లడించింది.
