AP Government : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. బీసీ రిజర్వేషన్లపై జీవో విడుదల
AP Government : ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
- Harish Thanniru
- Updated on- October 11, 2026 / 11:36 AM IST
AP Government
AP Government : ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తించేలా మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జీవో విడుదల చేసింది.
డెడికేటెడ్ కమిషన్ నివేదిక, సిఫార్సుల ఆధారంగా బీసీ రిజర్వేషన్లను నిర్ణయించడంతో పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపునకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదిక, సిఫార్సులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన ‘ట్రిపుల్ టెస్ట్’ విధానానికి అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని నిర్ణయించింది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, SGSW డేటాను ఆధారంగా తీసుకుని పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారీగా రిజర్వేషన్లను నిర్ణయించనున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ స్థానాలు, మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ స్థానాలు, వార్డు సభ్యుల స్థానాలకు రొటేషన్ విధానంలో రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. 2021లో అమలు చేసిన రిజర్వేషన్ సర్కిల్‌ను ప్రాతిపదికగా తీసుకుని తదుపరి రిజర్వేషన్లను ఖరారు చేయాలని ప్రభుత్వం సూచించింది.
అయితే వార్డుల పునర్విభజన జరిగితే వార్డు సభ్యుల రిజర్వేషన్ సర్కిల్‌ను కొత్తగా ప్రారంభించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ల కేటాయింపులో మొదట ఎస్టీ, తర్వాత ఎస్సీ, ఆపై బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమాన్ని అనుసరించనున్నారు.
గతంలో మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వం తాజా జీవోను విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల మొత్తం 50 శాతం పరిమితిని దాటకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 251ను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ జారీ చేశారు. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ పరిపాలన శాఖ అధికారులను ఆదేశించారు.
