YSR Vahana Mitra: వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం.. రేపే అకౌంట్లలోకి రూ.10వేలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కింద సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ నడుపుకుంటున్న వారికి రూ. 10వేలు వేసేందుకు సిద్ధమైంది జగన్ ప్రభుత్వం.

YSR Vahana Mitra: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కింద సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ నడుపుకుంటున్న వారికి రూ. 10వేలు వేసేందుకు సిద్ధమైంది జగన్ ప్రభుత్వం. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ను ప్రారంభించి వారికి అండగా నిలవనున్నారు. ఈ పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున రూ.248.46 కోట్లు వారి బ్యాంక్ అకౌంట్లలో వెయ్యనున్నారు.

ఈ పథకం కింద గతేడాది 2లక్షల 24వేల 777మంది లబ్ధిదారులుగా ఉండగా.. ఈ ఏడాది 2,05,536 మంది అర్హులుగా తేలారు. వాహనాలను విక్రయించడం, ఇతరత్రా కారణాలతో 19,241మంది అనర్హులయ్యారు. వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కోసం ఈ ఏడాది కొత్తగా 46,237 మంది దరఖాస్తు చేసుకోగా.. దరఖాస్తుల పరిశీలన అనంతరం వారిలో 42,932 మందిని అర్హులుగా నిర్ధారించారు. మొత్తం మీద పాత, కొత్త రిజిస్ట్రేషన్లు కలిపి 2,71,014 మందిలో 2,48,468 మందిని అర్హులుగా నిర్ధారించారు. మొత్తం లబ్ధిదారుల్లో 83 శాతం మంది.. అంటే 2,48,468 మందిలో 2,07,974 మంది బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలవారు.

ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే పేద డ్రైవర్లకు ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకం కింద ప్రతీ ఏడాది జగన్ ప్రభుత్వం రూ. 10వేలను ఇస్తుంది. ఈ పథకం ద్వారా ఏటా వారికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తూ.. డబ్బును వాహనాల ఫిట్‌నెస్, బీమా, మరమ్మతుల కోసం వినియోగించుకోవాలని సూచిస్తుంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తుల ప్రక్రియకు అవకాశం కల్పించగా.. దరఖాస్తు ప్రక్రియలో గ్రామవాలంటీర్లు సాయం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు