Pain Clinic: ఏపీలో ఆ పేషెంట్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ చికిత్సలన్నీ పూర్తి ఉచితం.. ఎక్కడంటే
ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఎబిలేషన్, సీఆర్మ్, అల్ట్రాసౌండ్ వంటి అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. వీటితో రోగులకు వైద్యం అందిస్తారు.
Satya Kumar Yadav Representative Image (Image Credit To Original Source)
- విశాఖ కేజీహెచ్ లో తొలి పెయిన్ క్లినిక్
- దీర్ఘకాలిక నొప్పులు, క్యాన్సర్ సంబంధిత నొప్పులతో బాధపడే వారికి బిగ్ రిలీఫ్
- రోగులకు పూర్తి ఉచితంగా ట్రీట్ మెంట్
- ఈ నెల 25 నుంచి అందుబాటులోకి సేవలు
Pain Clinic: ఏపీలో దీర్ఘకాలిక నొప్పులు, క్యాన్సర్ సంబంధిత నొప్పులతో బాధపడే వారికి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఇకపై వారు ట్రీట్ మెంట్ కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేలకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరమూ ఉండదు. ఎలాంటి ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగానే అదీ మన దగ్గరే ట్రీట్ మెంట్ పొందొచ్చు.
రాష్ట్రంలో తొలి పెయిన్ క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. విశాఖపట్నం కేజీహెచ్‌లో పెయిన్ క్లినిక్ ఏర్పాటు చేశారు. ఈ నెల 25 నుంచి రోగులకు ఈ క్లినిక్ అందుబాటులోకి వస్తుంది. పూర్తి స్థాయిలో సేవలు అందించనున్నారు. ఈ పెయిన్ క్లినిక్‌లో దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధాప్యంతో వచ్చే నొప్పులు, క్యాన్సర్ల కారణంగా వచ్చే నొప్పులతో బాధపడే వారికి ట్రీట్ మెంట్ ఇస్తారు. ఈ తరహా సేవలు పొందాలంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేల రూపాయలు వసూలు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం పూర్తి ఉచితంగా ఈ సేవలు అందిస్తారు.
అత్యాధునిక పరికరాలతో ట్రీట్ మెంట్..
‘పెయిన్ క్లినిక్’ స్థాపనకు ఆంధ్రా మెడికల్ కాలేజ్ అలుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా (AMCANA) కోటి రూపాయల విరాళం ఇచ్చింది. కేజీహెచ్ అత్యవసర వార్డ్ పైఅంతస్తులో సీపీఎం-పెయిన్ క్లినిక్ (సెంటర్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్)ను ఏర్పాటు చేశారు. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఎబిలేషన్, సీఆర్మ్, అల్ట్రాసౌండ్ వంటి అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. వీటితో రోగులకు వైద్యం అందిస్తారు. ఇక ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితం.
ఆపరేషన్ థియేటర్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పెయిన్ క్లినిక్ లో వైద్యం ఎలా చేస్తారో డాక్టర్లు చెప్పారు. నరాల్లో ఎక్కడ నొప్పి ఉందో గుర్తించి అందుకు తగినట్లుగా ట్రీట్ మెంట్ ఇస్తామన్నారు. ఈ క్లినిక్ లో ఒకసారి చికిత్స తీసుకుంటే ఇక సంవత్సరం పాటు ఉపశమనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కేజీహెచ్ ఎనస్తీషియా డిపార్ట్మెంట్ హెడ్ ఆధ్వర్యంలో ఈ క్లినిక్ నిర్వహిస్తారు.
ఓపీ సేవలు, 24 గంటలు అందుబాటులో సిబ్బంది..
నొప్పుల నివారణ కోసం ఈ క్లినిక్ లో ఏయే పద్ధతులు ఫాలో అవుతారో కూడా డాక్టర్లు వివరించారు. పెయిన్ థెరపీ, ఇంటర్వెన్షనల్, ఫార్మకోలాజికల్, ఫిజికల్, సైకలాజికల్ థెరపి వంటి చికిత్సలు అందిస్తామన్నారు. ఇక ఈ క్లినిక్ ద్వారా ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని, 24 గంటలు పాటు సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని తెలిపారు.
నిజానికి ఈ నెల 1వ తేదీన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ పెయిన్ క్లినిక్ కు ప్రారంభించారు. కీమోథెరపీ, రేడియోథెరపీ, నొప్పి నిర్వహణపై దృష్టి సారించి, క్యాన్సర్ సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి రాబోయే రోజుల్లో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను బలోపేతం చేస్తామన్నారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యంగా ఆయన చెప్పారు.
”రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తొలిసారిగా పెయిన్ క్లినిక్ ఏర్పాటు చేయడం ఒక చరిత్రాత్మక ముందడుగు. దీర్ఘకాలిక, క్యాన్సర్ సంబంధిత నొప్పితో బాధపడుతున్న రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది” అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
Also Read: గుడ్‌న్యూస్.. రైతులు బ్యాంక్ ఖాతాలు వెంటనే చెక్ చేసుకోండి..
