AP Weather Today : ఏపీని వదలని వాన.. నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. ఫ్లాష్‌ఫ్లడ్స్ అలర్ట్ జారీ..

AP Rains : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. శుక్ర, శనివారాల్లోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Andhra Pradesh Weather Updates Heavy Rains In These Districts Today

AP Rains : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి విశాఖపట్టణం నగరంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. అత్యధికంగా విశాఖపట్టణంలో 24గంటల వ్యవధిలో 277.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై వర్షం తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షం కారణంగా పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహించాయి. వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Also Read – AP Local Body Elections : లోకల్ ఎలక్షన్స్‌పై పవన్ స్పెషల్ ఫోకస్.. రంగంలోకి ఐదుగురు సభ్యుల కమిటీ!

కళింగపట్నం సమీపంలో తీవ్ర వాయుగుండం బుధవారం రాత్రి తీరదాటింది. గురువారం రాత్రికి వాయుగుండంగా బలహీనపడింది. రాబోయే 24 గంటల్లో క్రమంగా బలహీన పడుతుందని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే, ఇవాళ (శుక్రవారం), రేపు (శనివారం) కోస్తాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వర్షాలతోపాటు భీకర గాలులు వీచే అవకాశం ఉందని, గంటకు 60కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని.. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇవాళ ఉత్తరాంధ్రలోని అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలు.. కోస్తాలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు,నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడా ఆకస్మిక వరదలు రావొచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

మరోవైపు.. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం కూడా వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో.. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడంతోపాటు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు, ముంపు గ్రామాల ప్రజలకు తక్షణ సహాయక చర్యలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొండచరియలు విరిగిపడేచోట నివాసితుల్ని అప్రమత్తం చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.