AP Govt
AP Govt : ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్ మరో తీపికబురు చెప్పేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు నూతన పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా ఎదిగేలా నగరాలు, పట్టణాల్లో ఎగ్‌మార్ట్‌లు ఏర్పాటు చేసుకునేలా సాయం అందిస్తోంది.
Also Read : WPL 2026 : ఆర్సీబీ విజయోత్సవ సంబురాలు.. స్మృతి మంధాన ఆనందం చూశారా.. ఫొటోలు వైరల్..
పట్టణ పేద మహిళల ఉపాధికి కొత్తగా ఎగ్‌మార్ట్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి. జిల్లాకు పది చొప్పున మొత్తం 260 మార్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (ఎన్ఈసీసీ) ఆధ్వర్యంలో ఒక్కో మార్ట్ ఏర్పాటుకు రూ.50వేలు చొప్పున నిధులు సమకూర్చనున్నారు. ఇందులో రూ.35వేలతో కార్ట్ (బండి), ఇతర సామాగ్రి అందిస్తారు. మరో రూ.15వేల విలువైన గుడ్లు సరఫరా చేస్తారు. గుడ్లతోపాటు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఎగ్‌మార్ట్‌లను మెయిన్ రోడ్లు, ముఖ్యమైన కూడళ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. అయితే, ఆసక్తిఉన్న వారు ఈ ఎగ్‌మార్ట్ కోసం 15 అంశాలకు ఒకే చెబుతూ స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ ఎగ్‌మార్ట్‌ల ఏర్పాటులో పట్టణ పేదరిక నిర్మూనల సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో ఇప్పటి వరకు ఎలాంటి ఉపాధికి నోచుకోని వారికి, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. అర్హులైన మహిళలను ఎంపిక చేసేలా ఇప్పటికే మెప్మా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, వచ్చే నెలలో ఎగ్‌మార్ట్‌లను ప్రారంభించేలా అధికారులు దృష్టిసారించారు.
ఒక్కసారి ఎగ్‌మార్ట్ ఏర్పాటయిన తరువాత రోజువారీ గుడ్లను విక్రయించొచ్చు. గుడ్లతోపాటు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించొచ్చు. అయితే, ఎంపికైన వారికి ముందుగా శిక్షణ ఇస్తారు. వ్యాపారం ఎలా చేయాలి.. ఫుడ్ ఎలా తయారు చేయాలి వంటివి నేర్పిస్తారు.
పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులతో రూపాయి పెట్టుబడి లేకుండా ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ పెట్టుబడి మొత్తాన్ని ఎన్ఈసీసీయే అందిస్తుంది. ఇది మహిళల ఉపాధికి అరుదైన అవకాశమని మెప్మా అధికారులు చెబుతున్నారు.