Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం..
Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం జరిగింది. ఎస్ఎంఎస్ -1 టీపీబీలో ల్యాడీల్‌కు రంద్రం పడి స్టీల్ మెటల్ కింద పడిపోయింది.
- Harish Thanniru
- Updated on- June 11, 2026 / 11:04 AM IST
Vizag Steel Plant
Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని ఎస్ఎంఎస్ -1 టీపీబీలో ల్యాడిల్‌కు రంద్రం పడి ద్రవ ఉక్కు కింద పడిపోయింది. ఉదయం ఏ షిప్టులో 6.30గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, కార్మికులు, సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అత్యంత అధిక ఉష్ణోగ్రత వద్ద ఉండే ద్రవ ఉక్కు ఒక్కసారిగా ల్యాడిల్ నుంచి బయటకు రావడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో కార్మికులు, సిబ్బంది లేకపోవడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
ఘటన అనంతరం ప్లాంట్ భద్రతా సిబ్బంది, సాంకేతిక నిపుణులు ఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ద్రవ ఉక్కు లీకేజీకి కారణాలపై విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఇదిలాఉంటే కేంద్రం నియమించిన త్రీమెన్ కమిటీ విచారణ జరుగుతుండగానే మరోసారి ప్రమాదాలు జరుగుతుండటం గమనార్హం.
ఇప్పటికే విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సోమవారం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మరణించారు. మరికొందరికి గాయాలుకాగా.. వారు ఆస్పత్రికిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే మరో ప్రమాదం చోటు చేసుకోవటం స్థానికంగా ఆందోళనకు గురిచేస్తోంది.
