Cm Chandrababu – WFH: ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
పొదుపు చర్యలు ఒక్కసారిగా ప్రజలను భయపెట్టే విధంగా కాకుండా దశల వారీగా చేపడదామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనలకు సానుకూలంగా స్పందించారు సీఎం చంద్రబాబు.
- Naveen
- Updated on- May 14, 2026 / 06:25 PM IST
Cm Chandrababu – WFH: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 4 గంటల పాటు సాగిన మంత్రి మండలి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు చర్యలపై సీఎం చంద్రబాబు, మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలోని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంశంపైనా కీలక చర్చ కొనసాగింది. తమ తమ శాఖల పరిధిలో పొదుపు చర్యలు, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలని కార్యదర్శులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వర్క్ ఫ్రమ్ హోమ్ పై క్యాబినెట్ సబ్ కమిటీ వేద్దామని మంత్రులతో అన్నారు చంద్రబాబు.
దేశాన్ని కాపాడేందుకు పొదుపు చర్యలు పెద్దఎత్తున పాటిద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కాన్వాయ్ లు తగ్గించుకుంటే సరిపోదని, ఇతర మార్గాలు అన్వేషించాలని మంత్రులకు సూచించారు. అలాగే బంగారం కొనుగోళ్లు తగ్గించాలని పిలుపునిచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే ప్రక్రియ మన దగ్గర నుంచే ప్రారంభిద్దామన్నారు. సోలార్ వాడకాన్ని పెద్దఎత్తున అందిపుచ్చుకోవాలన్నారు. దేశం మనకెంతో ఇచ్చిందని, ఆ కృతజ్ఞత చాటే సమయంగా ప్రస్తుత పరిస్థితిని చూడాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంక్షోభాలు ఎదుర్కోవడం కొత్తేమీ కాదన్నారు. వాటిని సక్రమంగా అధిగమించటమే కీలకమన్నారు. మంత్రులంతా క్రైసిస్ ని మ్యానేజ్ చేసుకోవటం నేర్చుకోవాలన్నారు చంద్రబాబు.
పొదుపు చర్యలు ఒక్కసారిగా ప్రజలను భయపెట్టే విధంగా కాకుండా దశల వారీగా చేపడదామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనలకు సానుకూలంగా స్పందించారు సీఎం చంద్రబాబు. ప్రతీ నిర్ణయానికి 48 గంటల ముందు ప్రజలను సన్నద్ధం చేసి సమయం తీసుకుని ప్రకటన చేద్దామన్నారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్ మెంట్ ప్లాన్ కింద లక్ష కోట్ల ఖర్చు ప్రణాళికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అజెండా అంశాలు ముగిశాక తాజా పరిణామాలపై మంత్రులతో చర్చించారు చంద్రబాబు. కాగా, మీటింగ్ కు కార్యదర్శులు సకాలంలో రాకపోవటంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇంధన పొదుపు చర్యలపై చర్చించేందుకు మొదటి అజెండాగా చర్చిద్దామని గత రాత్రే విజయానంద్ కు చెప్పారు సీఎం చంద్రబాబు. అధికారులు లేకపోవడంపై విజయానంద్ ను ప్రశ్నించారు చంద్రబాబు. సమాచారం సరిగా ఇవ్వలేదా అని విజయానంద్ ను అడగ్గా.. సమాచారం ఇచ్చానని బదులిచ్చారు విజయానంద్. సమయానికి మీటింగ్ కు రాని అధికారుల నుంచి వివరణ తీసుకుని సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
పొదుపు చర్యలపై ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
* పొదుపు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు
* నా దేశం నా బాధ్యత పేరుతో కార్యక్రమం
* కాన్వాయ్ తగ్గించుకోవాలని మంత్రుల నిర్ణయం
* శుక్రవారం నో వెహికల్ డే
* నో వెహికల్ డే రోజున మంత్రులు ఈవీ లేదా సైకిల్ వినియోగం
* మంత్రులు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగించాలని నిర్ణయం
* ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై అధ్యయనం
* హాజరు అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
* ఈవీ స్టేషన్స్ పెట్టేవారికి ఇన్సెంటివ్స్
* కొన్నేళ్లపాటు మంత్రుల విదేశీ పర్యటనలు తగ్గింపు
* బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి
* సంక్షోభాన్ని ఎదుర్కొనేలా ప్రజలను సిద్ధం చేయడమే లక్ష్యం
Also Read: వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్.. వారానికి 2 రోజులు.. ఒక రోజు నో కార్ డే.. ఇంకా..
