Work From Home : వర్క్ ప్రమ్ హోమ్ పై సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన.. రెండు రోజుల్లో
Work From Home : వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది రియాలిటి. ఇంటి నుంచే ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితి వస్తుంది. దీనిని ప్రోత్సహించాలని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేసే పరిస్థితులు వస్తాయి. దేశం మొత్తం దుబారాను తగ్గించాలని చంద్రబాబు పేర్కొన్నారు.
- Harish Thanniru
- Updated on- May 13, 2026 / 04:14 PM IST
CM Chandrababu Naidu
Work From Home : పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, సొంత వాహనాలకు బదులు కార్ పూలింగ్, ప్రభుత్వ రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని.. ఇలా పలు రకాల సూచనలను ప్రధాని నరేంద్ర మోదీ చేశారు. ప్రధాని మోదీ ప్రకటించిన పొదుపు చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఎనిమిది అంశాలను పాటించాలని ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఒకటీ రెండు రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. యుద్ధ పరిస్థితుల వల్ల దేశంపై పలు విధాలుగా భారం పడుతోందన్న సీఎం.. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతోపాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండాలని సూచించారు.
ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఎనిమిది అంశాలను మనం పాటించాలి.. తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులు అధిగమించాలని చంద్రబాబు అన్నారు. పెట్రోలు, డీజిల్ వినియోగం తగ్గించాలి. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని అన్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది రియాలిటి. ఇంటి నుంచే ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితి వస్తుంది. దీనిని ప్రోత్సహించాలని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేసే పరిస్థితులు వస్తాయి. దేశం మొత్తం దుబారాను తగ్గించాలని చంద్రబాబు పేర్కొన్నారు.
పెద్దపెద్ద కాన్వాయ్ వాహనాల్లో వెళ్లటం అందరికీ చాలా పెద్ద ఫ్యాషన్‌గా మారిందని, కాన్వాయ్ వాహనాల సంఖ్య తగ్గించి ప్రజా ప్రతినిధులు ఆదర్శంగా నిలవాలని చంద్రబాబు సూచించారు. సెక్యూరిటీని కూడా కుదించుకోవాలని అన్నారు. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని ప్రధాని సూచించారని, దీనిని కూడా పాటిద్దామని అన్నారు.
మన దేశంలో, రాష్ట్రంలోనూ మంచి పర్యాటక ప్రాంతాలున్నాయి. ప్రజలు విదేశాలకు వెళ్లడం కంటే మన పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలి. నాదేశం- నా బాధ్యత అనే ఆలోచన ప్రజలంతా చేయాలి. రెండు రోజుల్లో దీనిపై చర్చించి స్పష్టమైన ప్రకటన చేస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బంగారం కొనడాన్ని కూడా తగ్గించాలని ప్రధాని చెప్పారని, దీనిపైనా ప్రజలు ఆలోచన చేయాలని ప్రజలకు చంద్రబాబు నాయుడు సూచించారు.
