TDP Formation Day 2026 : చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. ‘కార్యకర్తలని పట్టించుకోని నేతలు నాకు అక్కర్లేదు’

TDP Formation Day 2026 : తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లుడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ap cm chandrababu naidu speech at tdp formation day 2026 tdp central office

TDP Formation Day 2026 : తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ కార్యకర్తలను, నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. పలు కీలక అంశాలపై స్పందించారు. డీ-లిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అలానే కార్యకర్తలను పట్టించుకోని నేతలు తనకు అక్కర్లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం పని చేస్తానంటూ కార్యకర్తలతో కలిసి చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేశారు.

చంద్రబాబు ప్రసంగంలోని కీలకాంశాలు..
‘ఎవరు బాగా పని చేస్తే వారే ప్రజాప్రతినిధులు… ఈ సారి 50 శాతం సీట్లు పెరుగుతాయి. 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. క్రమశిక్షణతో పని చేయండి… పార్టీని బలోపేతం చేయండి.. కార్యకర్తలను గుర్తించే పని లోకేష్‌దే. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఆదర్శంగా ఉండాలి. వ్యక్తిగత ప్రవర్తన నుంచి ప్రతి అంశంలో తెలుగుదేశం బ్రాండ్ నిలిపేలా వ్యవహరించాలి. అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటేనే…రాష్ట్రం బలంగా ఉంటుంది. పార్టీ గెలుపే రాష్ట్రం గెలుపు. పసుపు జెండా నిరంతరం ఎగరాలి….రాష్ట్రం ఎప్పుడూ గెలవాలి. తెలుగు దేశం పుట్టుక నుంచి నేటి వరకు…మన సిద్ధాంతాలు, విజయాలు, ప్రయాణం…అన్నీ సంచలనమే’ అన్నారు.

‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమానికి నాంది పలికింది తెలుగుదేశం పార్టీనే అన్నారు. నాడు పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్లే అభివృద్ధికి అడుగులు పడ్డాయన్నారు. 40 ఏళ్ల క్రితం టీడీపీ తెచ్చిన రూ.2కే కిలో బియ్యం జాతీయ ఆహార భద్రతా పథకమైంది. అప్పుడు తెచ్చిన మహిళలకు ఆస్తి హక్కు తరువాత కేంద్రం చట్టం చేసింది. మహిళలకు నాడు స్థానిక ఎన్నికల్లో కల్పించిన రిజర్వేషన్… దశాబ్దాల తరువాత 33 శాతం రిజర్వేషన్‌కు అడుగులు పడడానికి కారణం అయ్యింది. మన ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ సంస్కరణలు.. ఆ తర్వాత ఎన్నో రాష్ట్రాలకు రోల్ మోడల్ అయ్యాయి’ అని చంద్రబాబు గుర్తు చేశారు.

‘మహిళా సాధికారతకు తెచ్చిన డ్వాక్రా సంఘాలు దేశంలోనే రోల్ మోడల్‌గా నిలిచాయి. బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టాం. ఎస్సీలకు వర్గీకరణతో సమన్యాయం చేశాం. ఎస్టీలకు భూములు, పథకాలు ఇచ్చి జీవితాలు మార్చాం. తెలుగుదేశం పార్టీ విజయాలనే కాదు…సంక్షోభాలను, సవాళ్లను చూసింది. ఎంతోమంది కార్యకర్తలు త్యాగాలు చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు కోల్పోయారు. నిద్రలేని రాత్రులు గడిపారు. టీడీపీని ఫినిష్ చేస్తామని ఆలోచన చేసిన వారే ఫినిష్ అయ్యారని’ తెలిపారు.

‘ఇన్నేళ్ల ప్రస్థానం, నేటి ఈ అధికారం అంతా కార్యకర్తల త్యాగాలు, కష్టం వల్లనే వచ్చింది. కార్యకర్తలను పట్టించుకోని వాళ్ళను, ఇబ్బంది పెట్టే నాయకులు మాకు అవసరం లేదు. పని చేసిన వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. కష్టపడిన వాళ్ళను కాపాడుకుంటాం… పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తాం. ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలకు, విధానాలకు, క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి. పార్టీ కార్యకర్తల వల్లనే మనం ఇక్కడ ఉన్నాం అని గుర్తుపెట్టుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా…కార్యకర్తలు కాలర్ ఎగరేసేలా పాలన అందిస్తున్నాం. నాయకత్వం పెంపు కోసం నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ టీడీపీనే. కార్యకర్తలకు రాజకీయ సాధికారత కల్పిస్తాం… అన్ని పదవుల్లోనూ జనాభా దామాషా పద్ధతిన అవకాశాలు కల్పిస్తాం. కార్యకర్తలకు ఆర్థిక సాధికారత కల్పిస్తాం. న్యాయబద్ధమైన సంపాదన వచ్చేలా సహకరిస్తాం’ అని చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు హామీ ఇచ్చారు.