Chandrababu Naidu : తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు.. ఈ నియోజకవర్గాల్లో పర్యటన
Chandrababu Naidu : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. అయితే, ఈనెల 20, 21 తేదీల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
- Harishth Thanniru
- Published on- April 19, 2026 / 01:55 PM IST
Chandrababu Naidu
- తమిళనాడులో చివరి దశకు చేరిన ఎన్నికల ప్రచారం
- 20, 21 తేదీల్లో ప్రచారంలో పాల్గోనున్న సీఎం చంద్రబాబు
- బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొని ప్రసంగించనున్న సీఎం
Chandrababu Naidu : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీకి సమయం దగ్గర పడుతోంది. ఈనెల 23వ తేదీన రాష్ట్రంలో ఒకే విడతలో 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. మరో రెండు రోజుల్లో ప్రచారపర్వానికి తెరపడనుంది. దీంతో డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెతిస్తున్నారు. అయితే, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పాల్గోనున్నారు.
తమిళనాడులో అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ పోటీ చేస్తుంది. ప్రస్తుతం టీడీపీ ఎన్డీయే కూటమిలో ఉండటంతో తమిళనాడులో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల అభ్యర్థుల విజయమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ఈనెల 20, 21 తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.
సోమవారం మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో కోయంబత్తూరు బయల్దేరి వెళ్తారు. రెండు రోజులపాటు సాగే ఈ పర్యటనలో కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, అవడి ప్రాంతాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ అభ్యర్థుల తరపున ఆయన ఓటర్లను అభ్యర్థించనున్నారు.
చంద్రబాబు నాయుడు తన ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొంటారు. హోసూరు సమీపంలోని తాలిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. దక్షిణాది రాజకీయాల్లో సీనియర్ నేతగా, భారతదేశం వ్యాప్తంగా మంచి గుర్తింపు కలిగిన రాజకీయ నేతగా ఉన్న చంద్రబాబు ప్రచారం తమిళనాడులోని ఎన్డీఏ కూటమికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు పర్యటన దృష్ట్యా తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూరు ప్రాంతాల్లో తెలుగుదేశం, ఎన్డీఏ శ్రేణులు ఇప్పటికే భారీ ఫ్లెక్సీలు, తోరణాలతో స్వాగత ఏర్పాట్లు పూర్తి చేశాయి.
