CM Jagan meeting with secretaries : రాష్ట్రంలో అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు, మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. దిశ చట్టం దగ్గరనుంచి, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఇలా చూస్తే… ఈ జాబితాలో చాలానే ఉన్నాయని పేర్కొన్నారు. సెక్రటేరియట్‌లో వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్ దాస్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు అజేయ కల్లం, నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ గడచిన 20 నెలలుగా మీతో కలిసి పనిచేయడం చాలా సంతోషకరమని అన్నారు. క్రికెట్‌లో కెప్టెన్ మాత్రమే గెలవలేడు, జట్టు సభ్యులందరూ కలిసి ఆడితేనే గెలుస్తాం.. అలాగే మీ అందరి సహకారంతో మనం ముందుకెళ్తున్నామని తెలిపారు.
మనం ఖర్చును కూడా తగ్గించుకుంటున్నామని చెప్పారు. విద్యుత్ కొనుగోళ్లు లాంటి అంశాల లోతుల్లోకి వెళ్లి డబ్బును ఆదా చేయగలిగామని పేర్కొన్నారు. దీన్ని కేంద్రం కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. జ్యుడిషయల్‌ప్రివ్యూ ద్వారా టెండర్లలో అవినీతిని రూపుమాపుతున్నామని తెలిపారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌క్లినిక్స్, గ్రామ సచివాలయాలు, భూముల రీసర్వే… గతంలో ఎప్పుడూ చేయనివని వెల్లడించారు.
నేరుగా నగదు బదిలీద్వారా పథకాలు అందిస్తున్నామని తెలిపారు. 90వేల కోట్లను బటన్‌నొక్కి అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో వేయగలిగామని చెప్పారు. ఆరోగ్యం, విద్యలో అనేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. దేశంలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద సంఖ్యలో చరిత్రలో ఎన్నడూ ఇన్ని ఇళ్లస్థలాల పట్టాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. 30 లక్షలకు పైగా ఇళ్లపట్టాలను ఇచ్చామని చెప్పారు. ఇళ్ల పట్టాల కార్యక్రమానికి కొత్త అర్థాన్ని, భాష్యాన్ని ఇవ్వగలిగామని తెలిపారు. 20 నెలల కాలంలో అనేక కలల్ని నిజం చేశామని తెలిపారు. అధికార యంత్రాంగం మనసుపెట్టి పనిచేసి…. ఈ పనులు చేయగలిగిందన్నారు.
20 నెలల కాలం గడిచింది.. ఇప్పుడు క్రికెట్‌లో మాదిరిగా మిడిల్ ఓవర్ల కాలం వచ్చిందని చమత్కరించారు. ఈ సమయంలో మనం మళ్లీ మన దృష్టిని కేంద్రీకరించుకోవాల్సి ఉందన్నారు. శాఖల మధ్య సమన్వయం సాధించాలని తెలిపారు. వీటన్నింటి మీద మనం దృష్టిసారించాలని చెప్పారు. ఇలాంటి సమావేశం పెట్టినందుకు సీఎస్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సమావేశాలు సమాచారలోపాన్ని నివారించడానికి కూడా తోడ్పడతాయని అన్నారు. సుపరిపాలన అందించడానికి దోహదపడతాయని చెప్పారు. మీరు ఆలోచనలు చేయండి, సలహాలు, సూచనలు చేయండి అని కోరారు. మంచి పాలనకు, మంచి ఫలితాలకోసం మీరు నాకు నివేదించవచ్చన్నారు.
మేనిఫెస్టో అంటే భారీగా పేజీలు, లెక్కలేనన్ని హామీలు.. ఎన్నికలు ముగిశాక అది ఎవ్వరికీ పట్టని వ్యవహారంగా ఉండేదని,..కాని ఇప్పుడు అలా కాదని తెలిపారు. కేవలం నాలుగు పేజీల్లో మేం ఏం చేస్తామో చెప్పాం.. దానికి కట్టుబడి కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ప్రతిరోజూ ఇందులోని అంశాలు చేశామా? లేదా? అని చూసుకున్నాం.. మేనిఫెస్టోలో 95శాతం అంశాలు అమలులో ఉన్నాయని తెలిపారు. మీ సహకారాన్ని పూర్తిగా నేను కోరుతున్నాని తెలిపారు. అధికారంలోకి వచ్చేనాటికి సుమారు రూ.60 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. అధికార యంత్రాంగంలో స్థైర్యం చాలా దిగువకు ఉండేదన్నారు. జన్మభూమి కమిటీల పేరిట పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలిపారు. కేంద్రంతో, పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు దెబ్బతినే స్థాయిలో ఉన్నాయని, అలాంటి పరిస్థితి నుంచి మనం ప్రయాణం మొదలుపెట్టామని తెలిపారు. మీ అందరి సహకారానికి ధన్యవాదాలని చెప్పారు.
గత ప్రభుత్వంలో పాలన మండలాలస్థాయిలో ఉండేదని..మనం గ్రామాల స్థాయికి పరిపాలనను తీసుకెళ్లామని సగర్వంగా చెప్పారు. ప్రతి విషయం మండల స్థాయికి వెళ్తే.. సేవలు అందడంలో విపరీత జాప్యం ఉంటుందని…కానీ, గ్రామస్థాయిలోకి పాలనను తీసుకెళ్లడం వల్ల లంచాలకు ఆస్కారం లేకుండా చేశామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఓన్ చేసుకోవాలన్నారు. అక్కడకు వస్తున్న వినతులపై పూర్తిగా అధికార యంత్రాంగం నుంచి స్పందన ఉండాలని తెలిపారు. అక్కడనుంచి వస్తున్న వినతులు ఏస్థాయిలో ఉన్నాయన్నదానిపై కార్యదర్శులు దృష్టిపెట్టాలన్నారు. ఆ స్థాయిలో వాళ్లు ఇన్వాల్వ్ కావాలని కోరుతున్నట్లు ప్రకటించారు.
అర్హులైన లబ్ధిదారులకు తప్పకుండా పథకాలు అందాలని ఇక్కడ వాలంటీర్లది కీలక పాత్ర అన్నారు. వాలంటీర్లది సేవ, వారిని మోటివేట్ చేయాలని తెలిపారు. దీనికోసం ఒక ఆలోచన చేశామని… ఉగాదిరోజు ప్రతి నియోజకవర్గంలో వాలంటీర్లను సత్కరించాలని..వారి సేవలను గుర్తిస్తూ వారికి సత్కారం చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో ఉగాది నుంచి ప్రతిరోజూ రోజుకు ఒక నియోజకవర్గంలో వాలంటీర్లకు సత్కార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కలెక్టర్, ఎస్పీ, జేసీ, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈకార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. వాలంటీర్లను సత్కరిస్తూ, వారిని గుర్తించేలా, వారిని పోత్సహించడానికి ఈ కార్యక్రమాలు చేయాలన్నారు. వారు చేసేది ఉద్యోగం కాదు, సేవ.. అందుకే వారిని మోటివేట్ చేయాలన్నారు. ప్రతిఏటా ఉగాది రోజున ఈ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని, దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.