Site icon 10TV Telugu

ఏపీలో మళ్లీ కుండపోత వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు.. బీ అలర్ట్..!

Heavy rains

Heavy rains

AP Rains: నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరంతో పాటు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో వేర్వేరు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతోపాటు పిడిగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇవాళ వర్షాలు పడనున్నాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

మరోవైపు ఈనెల 11వ తేదీ తరువాత నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సహా కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఇదిలాఉంటే.. మంగళవారం వైఎస్ఆర్ కడప, చిత్తూరు, ఎన్టీఆర్, పల్నాడు, అనకాపల్లి, తిరుపతి, ప్రకాశం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని.. చెట్ల కింద నిలబడకూదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇల్లు, ఇంట్లోని ఎలక్ట్రికల్ పరికరాలను సురక్షితంగా ఉంచుకునేందుకు సర్జ్ ప్రొటెక్టర్స్, మెరుపు రాడ్లు వంటివి ఏర్పాటు చేసుకోవటం మంచిదని తెలిపింది.

పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటే ఇంట్లోని కరెంట్ పరికరాలను అన్ ప్లగ్ చేయాలని అధికారులు సూచించారు. ఎలక్ట్రికల్ పరికరాలు, ఛార్జర్లు ఉపయోగించవద్దని సూచించింది. అలాగే ఉరుములు, మెరుపుల సమయంలో కిటికీలు, తలుపుల దగ్గరగా ఉండవద్దని.. దూరంగా ఉండాలని సూచించింది. ప్లంబింగ్, ఐరన్ పైపులను తాకవద్దని.. పారుతున్న నీటిని కూడా ఉపయోగించవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

 

Exit mobile version