AP Govt
AP Govt : ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. బడ్జెట్ లో తాజాగా కీలక ప్రతిపాదనలు చేశారు. ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించి, అన్ని జిల్లాల్లో సమాన వృద్ధిని సాధించడమే ఈ భారీ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
Also Read : AP Budget 2026 : నారా లోకేశ్‌కు కొత్త బిరుదు.. అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్‌లో ప్రకటన..
విశాఖపట్టణం ఎకనమిక్ రీజియన్ ..
మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో.. విజన్ స్వర్ణాంధ్ర 2047 అమలు కోసం ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చేందుకు, సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ప్రాంతీయ అభివృద్ధి విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా విశాఖపట్టణం, అమరావతి, తిరుపతి రీజియన్లను రాష్ట్రానికి కీలకమైన గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించిందని చెప్పారు. నీతి ఆయోగ్‌తో కలిసి విశాఖపట్టణం ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్)కి ఎకనమిక్ మాస్టర్ ప్లాన్ తయారు చేశామని చెప్పారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పొలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయని చెప్పారు.
విశాఖపట్టణం ఎకనమిక్ రీజియన్ పరిధిలో ఏడు గ్రోత్ ఇంజిన్లు ఉన్నాయి. వీటిలో మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, మౌలిక వసతులు, పట్టణీకరణ, వ్యవసాయంలో 41హై ఇంపాక్ట్ ప్రాజెక్టులు ఏర్పాటవుతాయని చెప్పారు. వాటికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ రంగాల నుంచి సమకూర్చుకుంటామని పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అంతేకాదు.. మెట్రో రైల్ ప్రాజెక్టులు సహా వీఈఆర్ కి సంబంధించి సుమారు 28వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు ప్రతిపాదనలు సమర్పిస్తున్నామని చెప్పారు.
అమరావతి ఎకనామిక్ రీజియన్..
వీఈఆర్ తరహాలోనే అమరావతి ఎకనామిక్ రీజియన్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఈ రీజియన్ పరిధిలోకి ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం జిల్లాలు రానున్నాయి. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే వనరులు.. గ్రోత్ ఇంజిన్లు, బలాల్ని గుర్తించేందుకు శాస్త్రీయ పద్దతుల్లో సామాజిక, ఆర్థిక అధ్యయనం నిర్వహిస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ తెలిపారు.
రాయలసీమ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ప్లాన్..
వీఈఆర్, అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి తరహాలో.. రాయలసీమ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ ను ప్రభుత్వం సిద్ధం చేసింది. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం, శ్రీసత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని 303 మండలాల్లో 200పైగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్స్ గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.