AP Cotton Procurement Guidelines : ఏపీలోని పత్తి రైతులకు అలర్ట్.. సీసీఐ కొనుగోళ్లపై ప్రభుత్వం కొత్త రూల్స్

AP Govt Cotton Procurement New Guidelines : సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా జరిగే పత్తి కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

AP Government SOP Cotton Procurement New Guidelines

AP Cotton Procurement News Guidelines : సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా జరిగే పత్తి కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పత్తి కొనుగోళ్లను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సీసీఐ ద్వారా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు పత్తి కొనుగోళ్లు చేపట్టడంతోపాటు, ఇందుకోసం ప్రత్యేక ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌వోపీ) అమలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికతో ఉత్తర్వులు జారీ చేసింది.

Also Raed : 13 రోజుల పసికందుకు పాస్‌పోర్ట్.. ఆంధ్రప్రదేశ్ చిన్నారి సరికొత్త రికార్డు! ఆ చిన్నారి కథ ఇదే..

ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం.. సీసీఐ గుర్తించిన, మార్కెటింగ్ శాఖ సిఫారసు చేసిన మార్కెట్ యార్డుల్లోనే పత్తి కొనుగోళ్లు నిర్వహించాలి. అలాగే, జాయింట్ కలెక్టర్లు నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లుల్లో మాత్రమే పత్తి సేకరణకు అనుమతి ఉంటుంది. సీసీఐ నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు ప్రక్రియను నిర్వహించేందుకు జిన్నింగ్ మిల్లుల్లో అత్యాధునిక సాఫ్ట్‌వేర్ వ్యవస్థలతోపాటు సీఎంయాప్‌, ప్రభుత్వ శాఖలకు చెందిన యాప్‌లను వినియోగించనున్నారు.

పత్తి విక్రయించే రైతులను ఆధార్, ఈ-క్రాప్ వివరాల ఆధారంగా గుర్తించనున్నారు. రైతు సాగు విస్తీర్ణం, దిగుబడి తదితర వివరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే పత్తి విక్రయానికి సీసీఐ అనుమతి ఇవ్వనుంది. ఈ-క్రాప్‌లో నమోదైన సాగు విస్తీర్ణం ఆధారంగా రైతు వద్ద ఉండే పత్తి పరిమాణాన్ని అంచనా వేయనున్నారు. ఇందుకోసం మండలాల వారీగా కోతలు, ఉత్పత్తి వివరాలను వ్యవసాయ శాఖ సిబ్బంది కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేయాలి.

రైతులు తమ పత్తిని విక్రయించేందుకు ముందుగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాల్లో రద్దీని నియంత్రించడంతోపాటు రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ప్రతిరోజు పత్తి కొనుగోళ్లకు సాయంత్రం 5గంటల వరకు చివరి అంచనా సమయంగా నిర్ణయించారు. స్లాట్ బుకింగ్ కోసం రైతులు ఆధార్, పట్టాదారు పాస్‌బుక్ నకళ్లను రైతు సేవా కేంద్రాల్లో సమర్పించాల్సి ఉంటుంది.

రైతు కుటుంబ సభ్యుల ద్వారా పత్తి సేకరణ జరిగే సందర్భాలను గుర్తించేందుకు రేషన్ కార్డుల డేటాను కపాస్ కిసాన్ యాప్‌తో పాటు సీసీఐ మాడ్యూల్‌కు అనుసంధానం చేయనున్నారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన రైతుల వివరాలను కూడా వ్యవస్థలో సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది. రైతు ఈ-క్రాప్‌లో నమోదు చేసుకున్న సాగు విస్తీర్ణం, మండలాల వారీగా హెక్టారుకు లభించే దిగుబడి, కోతల వారీగా నమోదైన ఉత్పత్తి తదితర అంశాలను పరిశీలించిన తర్వాత పత్తి విక్రయానికి సీసీఐ అనుమతి ఇవ్వనుంది. ఈ ప్రక్రియ ద్వారా సాగు చేయని భూమి పేరుతో పత్తి విక్రయించడం వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

సీసీఐ కొనుగోలు చేసిన పత్తికి సంబంధించిన మొత్తాన్ని రైతులకు ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా చెల్లించనున్నారు. రైతు ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలోకే చెల్లింపులు జమ చేయాలని నిర్ణయించారు. దీంతో మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించి రైతులకు నేరుగా డబ్బు అందే అవకాశం ఉంటుంది. అంతేకాక పత్తి సేకరణలో పారదర్శకత కోసం జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల విశ్లేషణకుకూడా చర్యలు తీసుకోవాలి. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీసీఐ అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.