Kotipalli-Narsapur Railway: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌కు రూ.100 కోట్లు.. అధికారిక జీవో జారీ
కోటిపల్లి-నర్సాపురం బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్(Kotipalli-Narsapur Railway) భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది.
- V Santhosh Kumar
- Published on- October 2, 2026 / 03:52 PM IST
ap government releases 100 crore kotipalli narsapur railway line land acquisition go issued
Kotipalli-Narsapur Railway: ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజల పాతికేళ్ల కల నెరవేరే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. కోటిపల్లి-నర్సాపురం మధ్య ప్రతిపాదిత బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ (Kotipalli-Narsapur Railway)నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.100 కోట్లను విడుదల చేస్తూ జీవో ఆర్టీ నంబరు 575 జారీ చేసింది. అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి ప్రత్యేక శ్రద్ధ వహించి నిరంతరం జరిపిన కృషి ఫలితంగానే ఈ నిధుల విడుదలకు బాటలు పడ్డాయి. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యలు ఈ నిర్ణయంతో సమసిపోవడంతో ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు తీవ్ర హర్షతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
25 ఏళ్ల నాటి కల నెరవేరే తరుణం.. గత ప్రభుత్వ అలసత్వానికి చెక్:
సుమారు 25 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మొత్తం నిర్మాణ వ్యయంలో 25 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. అయితే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూపాయి కూడా కేటాయించకపోవడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైల్వే శాఖతో కుదిరిన ఒప్పందాన్ని పునరుద్ధరిస్తూ, ప్రాజెక్టును తక్షణమే పునఃప్రారంభించి పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఈ నిధులను మంజూరు చేసింది.
ఆర్డీవోకు నిధుల బదిలీ.. పండుగ వాతావరణంలో కోనసీమ వాసులు:
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ రూ.100 కోట్ల నిధులను రవాణా, రోడ్లు-భవనాల శాఖ ద్వారా అమలాపురం ఆర్డీవోకు బదిలీ చేసినట్లు ఎంపీ హరీష్ బాలయోగి మీడియాకు వెల్లడించారు. నిధులు విడుదల కావడంపై కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. వెంటనే భూసేకరణ పూర్తి చేసి రైలు మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
