Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు.. కారణం ఏమిటంటే?
సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
- Harishth Thanniru
- Published On : March 2, 2025 / 01:46 PM IST
CID Ex Chief Sunil Kumar,
CID Ex Chief Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం, అదేవిధంగా విదేశాలకు వెళ్లే సమయంలో కొన్ని పర్యటనలకు అనుమతి తీసుకున్నప్పటికీ ట్రావెల్ ప్లానింగ్ కు విరుద్ధంగా విదేశాల్లో పర్యటించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆలిండియా సర్వీసు నిబంధనలను సునీల్ కుమార్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో దీనిపై గతంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోదియా నేతృత్వంలో విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు నిర్దారణ కావడంతో సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఫైర్ సర్వీస్ డీజీగా ఉన్నప్పుడు, సిఐడీ ఛీఫ్ గా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని, అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పూర్తి అనుకూలంగా పనిచేశాడని పీవీ సునీల్ పై మొదటి నుంచి టీడీపీ ఆరోపణలు చేస్తుంది. అదేవిధంగా మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసును సునీల్ కుమార్ ఎదుర్కొంటున్నారు.
సీఎస్ విజయానంద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐపీఎస్ అధికారులకు విదేశీ ప్రయాణానికి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ప్రభుత్వ విధానాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాలకు విదేశీ ప్రయాణానికి అనుమతి ఇచ్చే హక్కు ఉంది. అయితే, DOPT (2003) మార్గదర్శకాల ప్రకారం ముందుగా అనుమతి తీసుకోవాలి. పోలీసు వ్యవస్థలో క్రమశిక్షణ ముఖ్యమైంది. అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు పోలీసు సర్వీసు నిబంధనలకు విరుద్ధం. ఐపీఎస్ అధికారులు అధిక సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉంటారు. అనుమతిలేని పర్యటనలు జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించవచ్చునని సీఎస్ విజయానంద్ పేర్కొన్నారు. అయితే, ముందస్తు అనుమతి లేకుండా పలుసార్లు విదేశీ యాత్రలకు వెళ్లినట్లు సునీల్ కుమార్ పై అభియోగాలు ఉన్నాయి. అఖిలభారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కాండక్ట్ కు వ్యతిరేకంగా సునీల్ వ్యవహరించినట్లు భావిస్తూ డీజీపీ ర్యాంకులో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
పీవీ సునీల్ కుమార్ చేసిన అనుమతి లేని విదేశీ పర్యటనలు..
01.03.2024 నుంచి 04.03.2024 వరకు జార్జియా వెళ్లేందుకు అనుమతి తీసుకుని యూఏఈ వెళ్లారు.
02.09.2023 నుంచి 11.09.2023 వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా స్వీడన్ పర్యటన వెళ్లారు.
01.02.2023 నుంచి 28.02.2023 వరకు అనుమతి లేకుండా యూఎస్ఏ పర్యటన వెళ్లారు.
14.12.2022 నుంచి 19.12.2022 వరకు జార్జియా కు అనుమతి తీసుకుని యూఏఈ వెళ్లారు.
02.10.2021 నుంచి 08.10.2021 వరకు అనుమతి లేకుండా యూఏఈ పర్యటనకు వెళ్లారు.
21.12.2019 నుంచి 04.01.2020 వరకు యూఎస్ఏకు అనుమతి తీసుకుని యూకే వెళ్లారు.
