Ration Card eKYC : రేషన్ కార్డుదారులకి అలర్ట్.. ఈ పని చేయకపోతే.. పథకాలు ఆగిపోతాయి, రేషన్ రాదు.. వెంటనే ఇలా చేయండి
Ration Card eKYC : రేషన్ కార్డుదారులకి సర్కార్ కీలక అలర్ట్ జారీ చేసింది
- Dharani Pilli
- Updated on- May 11, 2026 / 02:40 PM IST
ap govt alert ration card holders must update ekyc complete smart card kyc as soon as possible
Ration Card eKYC : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు పొందాలంటే కచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి. అది కూడా వినియోగిస్తూ ఉండాలి. అంటే ఆ కార్డు మీద తప్పకుండా రేషన్ తీసుకోవాలి. ఈ క్రమంలో రేషన్ కార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుదారులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) చేయించాలని, లేదంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని హెచ్చరించింది. అలానే రేషన్ కూడా ఇవ్వరని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత ఏడాది నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తోంది. అలానే పాతవాటి స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డులను జారీ చేస్తోంది. దీంతో ఏపీలో చాన్నాళ్ల నుంచి స్మార్ట్ కార్డ్ ద్వారానే లబ్ధిదారులకు రేషన్ సరుకులు సరఫరా చేస్తున్నారు. అలానే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డ్ ప్రామాణికం. అందుకే దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డు ఈ-కేవైసీ లేని వారిని అనర్హులుగా గుర్తించి.. వారికి సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది లబ్ధిదారులు రేషన్ కార్డుకు సంబంధించి ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియను ప్రభుత్వం గత సంవత్సరం ప్రారంభించింది. అయినా ఇప్పటికీ కూడా చాలా మంది ఈ ప్రక్రియను ఇంకా పూర్తి చేయలేదు. అలాంటి వారందరూ సాధ్యమైనంత త్వరగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే కార్డు రద్దు అవుతుందని.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవంటున్నారు. అలానే రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ రేషన్ సరుకులను తీసుకోవాలని, ఎవరైతే తీసుకోరో వారికి కూడా రేషన్ సరఫరా ఆగిపోతుందని హెచ్చరిస్తున్నారు.
ఈ-కేవైసీని ఇలా చేసుకోండి:
-
ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి గాను రేషన్ కార్డు దారులు మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకుని మీ సమీపంలోని రేషన్ డీలర్ వద్దకు వెళ్లాలి.
-
అక్కడ ఉన్న e-PoS (ఈ-పాస్) మెషీన్‌లో మీ రేషన్ కార్డు నంబర్ నమోదు చేయాల్సిందిగా డీలర్‌ను అడగండి.
-
ఆ తర్వాత మీ వేలిముద్ర వేయడం ద్వారా మీ వివరాలను ధృవీకరించండి.
-
మీ వేలిముద్రలు పడకపోతే, ఐరిస్ (Iris) స్కాన్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
-
ఒకవేళ రేషన్ షాపులో సాంకేతిక సమస్యలు ఉంటే, మీరు సచివాలయంలో కూడా ఈ-కేవైసీ చేసుకోవచ్చు.
