ap govt
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అమరావతిలోని సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్చి నెల లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా దివ్యాంగులకు అందజేసే మూడు చక్రాల వాహనాల (రెట్రోఫిటెడ్ వాహనాలు) పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
Also Read : జగన్నాథ రథ చక్రాల్ వస్తున్నాయ్.. అంటూ రాజ్యసభలో కమల్ హాసన్ అద్భుతంగా తొలి ప్రసంగం.. వీడియో..
దివ్యాంగుల స్కూల్స్‌లో అడ్మిషన్లు పెంచాలని, మొత్తం సీట్లు భర్తీ చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఒకవేళ ఆ స్కూళ్లలో ఏవైనా రిపేర్లకు సంబంధించిన పనులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఆర్వో ప్లాంట్లకు సంబంధించి స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధుల సాయం తీసుకోవాలని, మెనూ పక్కాగా అమలు చేయాలని సూచించారు. వీలైనంత ఎక్కువ మంది వయోవృద్ధులకు సహాయ పరికరాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచనలు చేశారు.
అదేవిధంగా.. మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి రాష్ట్ర వ్యాప్తంగా డీసీవోలు, ప్రిన్సిపాళ్లతో జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ గురుకులాల్లో పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించేలా సిబ్బంది కృషి చేయాలని అన్నారు. గురుకులాల్లో 2026-2027 విద్యా సంవత్సరంలో 100శాతం ప్రవేశాలు ఉండాలని మంత్రి సూచించారు. పదో తరగతి లేదా ఇంటర్ పరీక్షల ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని, ఉత్తీర్ణత శాతం పెంచితే డీసీవోలు, ప్రిన్సిపాళ్లను ఘనంగా సన్మానిస్తామని, ఒకవేళ ఉత్తీర్ణత శాతం తగ్గితే మెమోలు జారీ చేస్తామని మంత్రి చెప్పారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రచారం కల్పించేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల వద్ద ప్లెక్సీలు ఏర్పాలు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. స్వర్ణ గ్రామ, వార్డు సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి శ్రీబాల వీరాంజనేయస్వామి సూచించారు. అలాగే స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి స్వామి కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలో వారి పనితీరుపైనా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని మంత్రి చెప్పారు.