AP High Court: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలి.. హైకోర్టులో పిల్.. తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలన్న పిల్ (AP High Court)పై వాదనలు పూర్తి చేసిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Ap high court reserves verdict on pil seeking stay on local body elections

AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన పిటిషన్ (PIL) పై విచారణ పూర్తి చేసిన ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు కోసం విడుదల చేసిన జీఓలు గతంలో హైకోర్టు(AP High Court) ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లను సరిగ్గా అమలు చేసేవరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ విన్నవించారు.

Supreme Court: మత మార్పిడి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే బీసీ అర్హత రద్దు

డెడికేషన్ కమిషన్ నివేదిక పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదన్న పిటిషనర్:

స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్‌పై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత మాత్రమే దాని సిఫార్సులను అమలు చేయాల్సి ఉందని పిటిషనర్ వాదించారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కమిషన్ నివేదికను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాల్సి ఉన్నప్పటికీ, అధికారులు అలా చేయకుండా అభ్యంతరాలను స్వీకరించలేదని కోర్టుకు తెలిపారు. నిబంధనలను పాటించకుండా రిజర్వేషన్లు అమలు చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్న ప్రభుత్వం.. తీర్పు రిజర్వ్:

ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కోర్టుకు విన్నవించారు. కేవలం ఫ్యామిలీ సర్వే ఆధారంగా మాత్రమే కాకుండా, ఇతర అనేక అంశాలను సమగ్రంగా పరిశీలించి, చట్టప్రకారమే రిజర్వేషన్లను ఖరారు చేశామని స్పష్టం చేశారు. ఇరువర్గాల సుదీర్ఘ వాదనలను విన్న ఉన్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.