Vangalapudi Anitha: బలపడుతున్న ‘అర్నబ్’ తుఫాన్.. గంటకు 125 కిమీ వేగంతో భీకర గాలులు.. ప్రజలకు హోంమంత్రి హెచ్చరిక!
'అర్నబ్' తుపాను ముప్పు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వ అధికారిక హెచ్చరికలనే పాటించాలని హోంమంత్రి అనిత(Vangalapudi Anitha) ఆదేశించారు.
- V Santhosh Kumar
- Published on- October 26, 2026 / 11:20 AM IST
AP Home Minister Vangalapudi Anitha issued key directives to officials regarding Arnab Cyclone
Vangalapudi Anitha: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను తీవ్రరూపం దాల్చే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. హోంమంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) ఉన్నతాధికారులతో నిరంతరం సమీక్షిస్తూ రాష్ట్ర యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో హైఅలర్ట్ చేశారు. ఇవాళ అర్ధరాత్రికి ఇది తీవ్ర తుపానుగా, రేపటికి అతి తీవ్ర తుపానుగా మారనుందని హోంమంత్రి వివరించారు. ఎల్లుండి ఉదయం బాపట్ల మరియు విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నందున, వాతావరణం ప్రశాంతంగా ఉందనే అపోహలతో ప్రజలు అలసత్వం వహించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
తీరం దాటే సమయంలో గంటకు 125 కిమీ వేగం.. రేపు, ఎల్లుండి ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి:
తుపాను తీరం దాటే సమయానికి గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో భీకర ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హోంమంత్రి హెచ్చరించారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు రేపు, ఎల్లుండి ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభావిత జిల్లాలకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. తీరప్రాంత ప్రజలు మరియు రైతులు రాబోయే 3 నుంచి 5 రోజుల పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు.. ప్రభుత్వ అధికారిక అలర్ట్‌లనే అనుసరించాలి:
తుపాను విపత్తు సమయంలో సోషల్ మీడియాలో వచ్చే అనవసర వదంతులను, పుకార్లను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. కేవలం ఏపీఎస్‌డీఎంఏ (APSDMA), ఆర్టీజీఎస్ (RTGS) అందించే ప్రభుత్వ అధికారిక హెచ్చరికలు మరియు సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని కోరారు. విపత్తు నిర్వహణ బృందాలు మరియు పోలీసు శాఖ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాయని, ఏ క్షణంలోనైనా సాయం అందించేలా కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పనిచేస్తున్నాయని హామీ ఇచ్చారు.
