Jonnagiri Gold : ఆంధ్రప్రదేశ్ సింబల్‌తో మార్కెట్‌లోకి వచ్చిన జొన్నగిరి గోల్డ్.. కర్నూలు షరాఫ్ బజార్‌లో సందడి

Jonnagiri Gold : కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గోల్డ్ మైన్‌లో ఉత్పత్తి చేసిన 99శాతం స్వచ్ఛత కలిగిన బంగారు బార్లు ఇప్పుడు కర్నూలు నగరంలోని షరా బజార్‌లోని జ్యువెలరీ దుకాణాల్లో అందుబాటులోకి వచ్చాయి.

AP Jonnagiri Gold Enters Jewellery Shops in kurnool

  • జొన్నగిరి బంగారం మార్కెట్లోకి
  • కర్నూలు షరా బజార్‌లో విక్రయాలు ప్రారంభం
  • దిగుమతి బంగారానికి ఏమాత్రం తీసిపోదంటున్న జ్యువెలర్లు

Jonnagiri Gold : ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలోనే తవ్వకాల ద్వారా వెలికితీసిన మేలిమి బంగారం మార్కెట్లోకి వచ్చింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గోల్డ్ మైన్‌లో ఉత్పత్తి చేసిన 99శాతం స్వచ్ఛత కలిగిన బంగారు బార్లు ఇప్పుడు కర్నూలు నగరంలోని షరాఫ్ బజార్‌లోని జ్యువెలరీ దుకాణాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సింబల్‌తో రూపొందించిన ఈ బంగారం వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Also Read : Sanjeevani Scheme : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. సంజీవని పథకంపై సీఎం చంద్రబాబు కీలక అప్డేట్..

2015 నుంచి జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జొన్నగిరిలో బంగారు నిక్షేపాల వెలికితీత కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ బంగారం ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో రాష్ట్రంలోనే తొలిసారిగా ఉత్పత్తి అయిన బంగారం ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రత్నాలసీమగా పేరొందిన కర్నూలు ఇప్పుడు బంగారం ఉత్పత్తికి కూడా కేంద్రంగా మారడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా 10టీవీతో జ్యువెలరీ వ్యాపారులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తొలి బంగారు బార్లను కొనుగోలు చేసిన వారిలో వాసవి బులియన్ కార్పొరేషన్‌కు చెందిన కామసిటి జగదీష్, కేఎంఎస్ జువెలర్స్‌కు చెందిన శ్రీహరిమూర్తి, సాయి సంతోష్ జువెలర్స్‌కు చెందిన చక్రపాణి ఉన్నారు. వీరితో పాటు కోయంబత్తూరుకు చెందిన ఎమ్రోల్డ్ కంపెనీ ప్రతినిధి శ్రీనివాసన్ కూడా బంగారు బార్‌ను అందుకున్నారు. కొందరికి ఒక కిలో, మరికొందరికి అర కిలో బంగారు బార్లను అందజేసినట్లు తెలిపారు.

జొన్నగిరి బంగారం నాణ్యత అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోదని జ్యువెలరీ వ్యాపారులు చెబుతున్నారు. 99 శాతం స్వచ్ఛతతో లభిస్తున్న ఈ బంగారం స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి దిగుమతి అయ్యే బంగారంతో సమానమైన నాణ్యత కలిగి ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా, స్థానికంగా ఉత్పత్తి కావడంతో రవాణా, బీమా వంటి అదనపు ఖర్చులు తగ్గి వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.

‘మన బంగారం.. మన ఆంధ్రప్రదేశ్‌ది’ అనే నినాదంతో ఈ బంగారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని జ్యువెలరీ షాపుల యజమానులు తెలిపారు. జొన్నగిరి గోల్డ్‌తో తయారైన ఆభరణాలపై ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడంతోపాటు ప్రతి గ్రాముపై అదనపు ప్రయోజనాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. కర్నూలు నేలలో వెలిసిన ఈ బంగారం రాష్ట్ర ఖనిజ రంగానికి కొత్త గుర్తింపునివ్వడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి కూడా కొత్త దిశ చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.