Gold Mining Project In Kurnool : ఏపీలోనూ ఓ కేజీఎఫ్..! కర్నూలు జిల్లాలో ‘గోల్డ్‌మైన్‌’ రెడీ.. రేపటి నుంచి అసలు కథ మొదలు..

Gold Mining Project In Kurnool : కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలోని గనుల నుంచి బంగారం వెలికితీతకు తరుణం ఆసన్నమైంది. సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం పూర్తిస్థాయి ఉత్పత్తికి శ్రీకారం చుట్టనున్నారు.

Gold Mining Project In Kurnool

  • కర్నూలు జిల్లాలో ‘గోల్డ్‌మైన్‌’ రెడీ
  • రేపటి నుంచి పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభం
  • ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Gold Mining Project In Kurnool : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారం ఉత్పత్తికి తొలి అడుగు పడనుంది. కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలోని గనుల నుంచి బంగారం వెలికితీతకు తరుణం ఆసన్నమైంది. ఈ ప్రాంతంలో గోల్డ్ ఉత్పత్తి చేసే ప్రక్రియ ప్రయోగాత్మకంగా ఇప్పటికే విజయవంతమైంది. సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం పూర్తిస్థాయి ఉత్పత్తికి శ్రీకారం చుట్టనున్నారు.

Also Read : Hyderabad To Chennai High Speed Rail : అమరావతి మీదుగానే హైదరాబాద్‌- చెన్నై హైస్పీడ్‌ రైల్‌‌.. తెలంగాణ, ఏపీలో ఈ ప్రాంతాల్లోనే స్టేషన్లు..

ఏపీకి చెందిన కర్నూలు జిల్లా త్వరలోనే దేశంలోనే ప్రముఖ బంగారు గనుల కేంద్రంగా గుర్తింపు పొందనుంది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గోల్డ్‌మైన్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. అధికారికంగా రేపటి నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్ ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏర్పాటు చేయగా.. అనంతరం చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు విజయవంతం అయింది. దీంతో తాజాగా.. పూర్తిస్థాయి ఉత్పత్తికి మార్గం సుగమమైంది. దాదాపు 1,494.55 ఎకరాల విస్తీర్ణంలో రూ.320 కోట్ల వ్యయంతో ఈ గోల్డ్‌మైన్ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టును తొలుత ఆస్ట్రేలియా కంపెనీ జియోమైసూర్ రూ.320 కోట్ల పెట్టుబడితో నిర్మించింది. ఇందులో 70శాతం వాటాను ఇండియాకు చెందిన మైనింగ్ వ్యాపారి ప్రభాకరన్ కు చెందిన త్రివేణి ఎర్త్‌మూవర్స్‌ కొనుగోలు చేసింది. అదేవిధంగా జియో మైసూర్‌లో 27.27 శాతం డాటా డెక్కన్‌ గోల్డ్‌మైన్స్‌
కు ఉంది. దీంతో గోల్డ్‌మైన్‌కు బీజం ఆస్ట్రేలియా కంపెనీ వేసినా.. ఉత్పత్తి మాత్రం ఇండియా కంపెనీలే చేస్తున్నాయి.

స్వాతంత్య్రం తర్వాత దేశంలో ప్రారంభం అవుతున్న తొలి గోల్డ్‌ మైన్‌ ఇదే కావటం విశేషం. కోలార్, రాయచూర్‌లోని హట్టి గోల్డ్‌మైన్స్‌ స్వాతంత్ర్యనికి పూర్వం నిర్మించినవే. దీంతో కొత్త తరహా ఆధునిక సాంకేతికతతో ఏర్పాటైన ఈ ప్రాజెక్టు దేశ గనుల రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందనుంది. ఈ గోల్డ్‌మైన్‌ ప్రాజెక్టు ద్వారా కర్నూలు జిల్లాలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కూడా ఊతమివ్వనుంది.

కర్నూల్ గోల్డ్‌మైన్‌లో పూర్తి‌స్థాయి ఉత్పత్తి ప్రారంభం తర్వాత రాష్ట్ర ఖజానాకు కూడా గణనీయమైన ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. బంగారం ఉత్పత్తి చేసే కంపెనీ తొలుత రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ, డిస్ట్రిక్ మినర్ ఫండ్ కలిపి ఉత్పత్తిలో 4.6శాతం చెల్లించాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఎన్‌ఎంఈటీకు 0.5శాతం చెల్లించాలి. డోరేబార్ నుంచి బంగారం బులియన్ గా మారిన తరువాత దాదాపు 30శాతం కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ లు చెల్లించాలి. అంతేకాక.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది.