AP MPTC–ZPTC Results : బొత్స నుంచి పరిటాల వరకు.. పరిషత్ బరిలో రాజకీయ వారసులు.. ఓటర్ల తీర్పు ఎటువైపు..?

AP MPTC–ZPTC Election Results : ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. చింతమనేని, దువ్వాడ, బొత్స, మజ్జి, కళా వెంకట్రావు కుటుంబాల వారసుల రాజకీయ భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది..

AP Local Body Elections

  • ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలపై ఉత్కంఠ..
  • పరిషత్ ఎన్నికల్లో వారసుల హవా..
  • రాజకీయ నేతల కుటుంబ సభ్యులకు అగ్నిపరీక్ష..

AP MPTC–ZPTC Election Results : ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇన్నాళ్లూ ప్రచారాలు, హామీలు, ఇంటింటి ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించిన అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది..

దీంతో అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల్లోనూ టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖుల కుటుంబ సభ్యులు, వారసులు బరిలో ఉండటంతో ఫలితాలపై ఆసక్తి మరింత పెరిగింది. కొందరు నేరుగా ఎన్నికల బరిలో నిలవగా, మరికొందరు స్థానిక సంస్థల్లో తమ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు..

ఎమ్మెల్యే చింతమనేని కుమార్తె ఏకగ్రీవం :
ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖుల కుటుంబ సభ్యులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్యశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆమె ఎన్నికకు ముందే విజయం సాధించినట్లయింది..

మరోవైపు, వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె హైందవి టెక్కలి ఎంపీటీసీ స్థానంలో పోటీ చేశారు. మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి కొయ్యూరు జెడ్పీటీసీ స్థానానికి బరిలో నిలిచారు. అలాగే మాజీ మంత్రి పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ నల్లచెరువు జెడ్పీటీసీ స్థానంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

బొత్స కుటుంబం నుంచి నలుగురు బరిలో.. :

విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబం నుంచి పలువురు ఎన్నికల బరిలో నిలవడం ఈ పరిషత్ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన నలుగురు అభ్యర్థులు వేర్వేరు జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేశారు.

బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష బొండపల్లి జెడ్పీటీసీ స్థానం నుంచి బరిలో నిలవగా బొత్స కోడలు పూజిత గరివిడి జెడ్పీటీసీ స్థానం నుంచి బరిలో నిలిచారు. బొత్స సత్యనారాయణ సోదరి సంగంరెడ్డి వెంకటలక్ష్మి గుర్ల జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేశారు.

బొత్స తమ్ముడి కుమారుడు బొత్స చైతన్య కూడా పూసపాటిరేగ జెడ్పీటీసీ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.. ఒకే రాజకీయ కుటుంబానికి చెందిన నలుగురు వేర్వేరు స్థానాల్లో పోటీ చేయడంతో ఆయా ఫలితాలపై ఆసక్తి నెలకొంది..

 Read Also : AP MPTC-ZPTC Election Results : పరిషత్‌ పోరులో గెలుపెవరిది? కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. 365 కేంద్రాల్లో భారీ ఏర్పాట్లు!

మజ్జి శ్రీను కుమార్తెకు కళా వెంకట్రావు కోడలితో పోటీ :
విజయనగరం జిల్లా రాజకీయాల్లో మరో ఆసక్తికర అంశం మజ్జి శ్రీను కుటుంబం నుంచి ఆయన కుమార్తె సిరి సహస్ర ఎన్నికల బరిలో నిలిచారు.. మజ్జి శ్రీను కుమార్తె సిరి సహస్ర కొత్తవలస, తెర్లాం జెడ్పీటీసీ స్థానాల నుంచి బరిలో నిలిచారు.. ఇక మాజీ మంత్రి కళా వెంకట్రావు కోడలు కిమిడి సంధ్య గరివిడి జెడ్పీటీసీ స్థానం నుంచి బరిలో నిలిచారు.

ముఖ్యంగా జెడ్పీ చైర్మన్ పదవి రేసులో మజ్జి శ్రీను కుమార్తె సిరి సహస్ర, కళా వెంకట్రావు కోడలు కిమిడి సంధ్య పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.. దీంతో వీరిద్దరి రాజకీయ భవితవ్యంపై ఆసక్తి నెలకొంది. అయితే, వీరు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇది నేరుగా ఒకే స్థానంలో జరిగే పోటీ కాకుండా, జెడ్పీ చైర్మన్ పదవిని దృష్టిలో పెట్టుకున్న రాజకీయ పోటీగా కనిపిస్తోంది..

రాజకీయ కుటుంబాల ప్రతిష్ఠకు పరీక్ష :
మొత్తానికి ఈ పరిషత్ ఎన్నికలు కేవలం స్థానిక అభ్యర్థుల మధ్య పోటీగానే కాకుండా రాజకీయ కుటుంబాల ప్రతిష్ఠకు కూడా పరీక్షగా మారాయి. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీల కుటుంబ సభ్యులు బరిలో ఉండటంతో ఆయా స్థానాల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ప్రత్యేక చర్చ నడుస్తోంది..

ముఖ్యంగా బొత్స కుటుంబం నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు, మజ్జి శ్రీను కుమార్తె సిరి సహస్ర, కళా వెంకట్రావు కోడలు కిమిడి సంధ్య వంటి వారసుల విజయావకాశాలపై ఉత్కంఠ నెలకొంది. ప్రజలు ఎవరికి పట్టం కట్టారు? ఏ రాజకీయ కుటుంబం తమ పట్టును నిలబెట్టుకుంది? ఎవరికి షాక్ ఇచ్చారు? అనే ప్రశ్నలకు ఎన్నికల ఫలితాలతో తేలనుంది..