AP Municipal Election Results 2026 : గెలిచేదెవరో.. నేడే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఓట్ల లెక్కింపు తీరు ఇలా.. తొలి ఫలితం ఎక్కడ.. ఎప్పుడంటే?
AP Municipal Election Results 2026 : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు సంబంధించి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8గంటల నుంచి ప్రారంభం కానుంది.
- Harish Thanniru
- Updated on- November 3, 2026 / 07:48 AM IST
Ap Municipal Election Results 2026 Updates Full Details
AP Municipal Election Results 2026 : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు సంబంధించి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8గంటల నుంచి ప్రారంభం కానుంది. రాత్రి 8గంటల వరకు ఫలితాలు ప్రకటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.. తరువాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లు లెక్కిస్తారు. నగర పంచాయతీలు, చిన్న పురపాలికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. కార్పొరేషన్లు, పెద్ద మున్సిపాలిటీల్లో రాత్రికే ఫలితాలు వచ్చే చాన్స్ ఉంది.
13కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగ్గా.. ఓట్ల లెక్కింపు కోసం 138 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కు 47,817 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గోనున్నారు. ఎన్నికలు జరిగిన 13 మేయర్ స్థానాలకుగాను కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ 10 చోట్ల, జనసేన పార్టీ రెండు స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో పోటీ చేశాయి. వైసీపీ 13 స్థానాల్లో పోటీ చేసింది. 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల చైర్ పర్సన్ స్థానాలకు గాను 18చోట్ల ఏకగ్రీమయ్యాయి. మిగిలిన 70 చైర్ పర్సన్ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు 49 చోట్ల, జనసేన నుంచి 17 స్థానాల్లో, బీజేపీ నుంచి నాలుగు స్థానాల్లో అభ్యర్థులు బరిలో నిలిచారు. వైసీపీ అభ్యర్థులు 70చోట్లా పోటీ చేశారు.
కౌంటింగ్ లో తొలత బ్యాలట్ పత్రాలను 25 చొప్పున కట్టలుగా కడతారు. అనంతరం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. డివిజన్లు, వార్డుల్లో ఓట్ల ఆధారంగా బ్యాలట్ పత్రాలు కట్టలు కట్టేందుకు గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. లెక్కింపు కేంద్రాల్లో మొత్తాన్ని వీడియో చిత్రీకరిస్తారు. స్ట్రాంగ్ రూం తెరవడం నుంచి బ్యాలెట్ బాక్సుల తరలింపు, లెక్కింపు హాళ్ల ఏర్పాటు, ఓట్ల లెక్కింపు, భద్రతా ఏర్పాట్లు, అభ్యర్థులు, ఏజెంట్లు ఫలితాల ప్రకటన, ఎన్నికల ధ్రువీకరణ పత్రాల అందజేత, ఎన్నికల పత్రాల సీలింగ్ వంటి అన్ని ముఖ్యమైన దశలనూ వీడియో తీస్తారు. దానిని జిల్లా ఎన్నికల అథారిటీ అధీనంలో ఉంచుతారు.
రీకౌంటింగ్ అవసరం అయితే ఎలా..?
ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ప్రతీ అభ్యర్థి వచ్చిన ఓట్ల సంఖ్యను ఫలితాల పట్టికలో నమోదు చేసి ప్రకటించాలి. అనంతరం ఒకట్రెండు నిమిషాలు వేచిచూస్తారు. ఈ సమయంలో అభ్యర్థి లేదా ఆయన ఎన్నికల ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్ రీ కౌంటింగ్ కోరవచ్చు. రీ కౌంటింగ్ కోసం లిఖితపూర్వక దరఖాస్తు సమర్పించేందుకు 15 నిమిషాలు సమయం ఇస్తారు. రీ కౌంటింగ్ కోరిన కారణాలను పరిశీలించి, ఆ తరువాత రీకౌంటింగ్ కు అనుమతించాలా? తిరస్కరించాలా అనేది నిర్ణయిస్తారు.
