AP Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. మూడ్రోజులు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ..

AP Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

AP Weather Updates

AP Rain Alert : ఏపీలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. వర్షాల జాడ కనిపించడం లేదు. దీంతో ఎండల తీవ్రతతో, ఉక్కపోతతో ప్రజలు.. మరోవైపు వివిధ పంటలు సాగుచేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ వర్షాలపై కీలక సమాచారం ఇచ్చింది.

Also Read : Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలంలో సరికొత్త రికార్డ్.. గజం రూ.1.80 లక్షలు.. ఏకంగా రూ.366 కోట్ల ఆదాయం!

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ద్రోణి కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

నేడు (బుధవారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షాలకాలం సీజన్ ముగిసింది. అయితే, ఈ సీజన్ లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో నీటి కొరత తీవ్రంగా వేదిస్తోంది. పంటలు సాగుచేసిన రైతులు నీరులేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతికొచ్చే పంటలు ఎండిపోతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కురిస్తే రైతులకు భారీ ఊరట లభించనుంది. ఈ క్రమంలో నేటి నుంచి మూడ్రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో రైతులు వర్షం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. భారీ స్థాయిలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో పొలంలో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది వాయుగుండంగా మారి ఏపీవైపు వస్తే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవాళ లేదంటే రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.