AP Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ..
AP Rain Alert : ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
- Harish Thanniru
- Published on- October 11, 2026 / 07:04 AM IST
AP Rain Alert
AP Rain Alert : ఏపీలో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి. గత వారంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కాగా.. గడిచిన వారం రోజలుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీంతో ఎండల తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. సాగుచేసిన పంటలు ఎండిపోయే స్థితికి చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ వర్షాల పై కీలక అప్డేట్ ఇచ్చింది.
ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది తదుపరి మూడు నాలుగు రోజుల్లో బలపడి, పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు-దక్షిణకోస్తాంధ్ర తీరాల వైపు కదిలే సూచనలున్నాయని పేర్కొంది. కాగా, ఇది బుధవారానికి వాయుగుండంగా మారవచ్చని కొన్ని వాతావరణ మోడల్స్, అల్పపీడనంగానే కొనసాగుతుందని మరికొన్ని మోడల్స్ అంచనా వేస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఇది తవ్ర వాయుగుండంగా మారితే రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. అక్టోబర్ 11న నెల్లూరు, కడప, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదంటే ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉండటంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే సూచనలున్నాయి. అక్టోబర్ 12న (సోమవారం) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, అల్పపీడనం వాయుగుండంగా మారడం, ఆ తరువాత తుఫానుగా మారడం అనేది వేరువేరు దశలు కావడంతో ప్రస్తుతానికి తుఫాను వస్తుందని నిర్ధారించలేమని అధికారుల తెలిపారు. వర్షాలతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు, ఈదురుగాలులు సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులు సూచించారు.
