Rain Alert : ఏపీకి మరో వాన గండం.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు.. తెలంగాణలో తూర్పు జిల్లాలకు హెచ్చరికలు..
AP Telangana Rain Alert : ఏపీలో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈనెల 12వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
- Harish Thanniru
- Published on- November 6, 2026 / 12:16 PM IST
Andhra pradesh weather update
AP Telangana Rain Alert : ఏపీని వరుణుడు వీడటం లేదు. ఇప్పటికే అర్నబ్ తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత మూడు రోజుల క్రితం మురసు తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. తుపాను ప్రభావంతో ఇప్పటికీ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Also Read : Jagan KTR CM Vijay Meeting : పెండ్లి వేడుకలో సందడి చేసిన వైఎస్ జగన్, కేటీఆర్, సీఎం విజయ్.. ఫొటోలు వైరల్
వరుస తుపానులతో రైతులు సాగు చేసిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజలు ఆర్థికంగా నష్టపోయారు. తుపాను ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో మరోసారి వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
నవంబర్ 6 నుంచి 12వ తేదీ వరకు ఏపీలోని కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. కోస్తాంధ్రలో ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 10వ తేదీ వరకు గంటకు 30–40 కిలోమీటర్లు, గరిష్ఠంగా 50 కిలోమీటర్లు వేగంతో బలమైన గాలులు వీచే సూచనలున్నాయి. మరోవైపు.. రాయలసీమలోనూ అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణలోనూ ఈ వారం రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా నవంబర్ 6, 7 తేదీల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర, పశ్చిమ తెలంగాణలో మోస్తరు నుంచి ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.
గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసినా.. పోలవరం సహా ప్రధాన జలాశయాలకు భారీగా వరద ఇన్‌ఫ్లోలు వస్తాయని ప్రస్తుత అంచనాలతో నిర్ధారించలేమని అధికారులు తెలిపారు. అయితే, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నందున ఉపనదుల ప్రవాహాలపై నిఘా ఉంచాలని అధికారులకు సూచనలు జారీ అయ్యాయి.
